హైదరాబాద్ లో ఛార్లెస్ స్క్వాబ్ టెక్నాలజీ డెవెలప్మెంట్ సెంటర్
డల్లాస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో కంపెనీ ప్రతినిధుల చర్చలు
ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. భారత్లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్ ఇదే కావటం విశేషం.అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ లో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గారు, మంత్రి శ్రీధర్ బాబు గారితో ఛార్లెస్ స్క్వాబ్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు డెన్నిస్ హోవార్డ్ గారు, రామ బొక్కా గారి సారథ్యంలో ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా టెక్నాలజీ అండ్ డెవెలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామని చెప్పారు. తమ కంపెనీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుకు కంపెనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు ఛార్లెస్ స్క్వాబ్ తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్‌కు పంపించనున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగంలోనూ హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించనుంది.
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో ముఖ్యమంత్రి బృందం భేటీ
తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యంపై సంప్రదింపులు
స్కిల్ డెవెలప్మెంట్, నెట్ జీరో, ఫ్యూచర్ సిటీ, సిటిజన్ హెల్త్ ప్రాజెక్టులపై ఆసక్తి
తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు ప్రపంచ బ్యాంక్ సంసిద్ధతను వ్యక్తం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు కలిసికట్టుగా రోడ్ మ్యాప్ను రూపొందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ప్రధానంగా స్కిల్ డెవెలప్మెంట్, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, నెట్ జీరో సిటీ, ఆరోగ్య సంరక్షణ, డయాగ్నస్టిక్స్, హెల్త్ ప్రొఫైల్ రంగాల్లో భాగస్వామ్యానికి అవసరమైన సంప్రదింపులు జరిగాయి.ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ఉన్నతాధికారులు శేషాద్రి, విష్ణు వర్ధన్ రెడ్డి, అజిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణం, జీవనోపాధి, నైపుణ్యాల వృద్ధి, ఉద్యోగాలు, ఆర్థిక సుస్థిరత తో పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల తమ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలన్నీఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తాము చేపట్టబోయే ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికన అమలు చేసి తీరుతామని ప్రకటించారు. అన్నింటిలోనూ అత్యంత పారదర్శకతను పాటిస్తామని స్పష్టం చేశారు. ప్రాంతాల వారీగా చేపట్టే ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, వాటి అమలును వేగవంతం చేసేందుకు వివిధ విభాగాలకు చెందిన నిపుణుల బృందం ఏర్పాటు చేయాలనే ఆలోచనలను ప్రపంచబ్యాంకు బృందంతో పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ అభివృద్ధికి ముఖ్యమంత్రి అనుసరిస్తున్న సమతుల్య దృక్పథం మంచి ఫలితాలను అందిస్తుందని ప్రపంచ బ్యాంకు బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. గతంలో భారత్ లో తమ భాగస్వామ్యంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు సానుకూల ఫలితాలు అందించాయని గుర్తు చేసింది. చర్చల సందర్భంగా నెట్ జీరో సిటీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చూపిన చొరవపై ప్రపంచ బ్యాంకు బృందం మరింత ఆసక్తిని ప్రదర్శించింది. ప్రజా పాలనతో పాటు రాష్ట్రంలో సమగ్ర సమతుల్య అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును చర్చల్లో పాలుపంచుకున్న ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్ ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం ప్రపంచ బ్యాంకు లాంటి అంతర్జాతీయ ద్రవ్యసంస్థలతో కలిసి పని చేయాలని నిశ్చయించటం ఇదే మొదటి సారి. తెలంగాణలో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, స్కిల్ యూనివర్శిటీ, సిటిజన్ హెల్త్‌కేర్, హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కీలకమైన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి అనుసరిస్తున్న భవిష్యత్తు వ్యూహాలకు ప్రపంచ బ్యాంకు మద్దతు మరింత ఊతమివ్వనుంది.
తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద ప్రోత్సాహకంగా, అమెరికాకు చెందిన ప్రముఖ వాల్ష్ కర్రా హోల్డింగ్స్ (WKH) సంస్థ తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వీ-హబ్ [WE HUB – Women Entrepreneurs Hub]లో 5మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి సమక్షంలో వాల్ష్ కర్రా హోల్డింగ్స్ సంస్థ ప్రతినిధులు – వీ హబ్ సీఈవో సీతా పల్లచోళ్ల ఒప్పందాలపై సంతకాలు చేశారు. రాబోయే ఐదేండ్లలో 100 మిలియన్ డాలర్ల (రూ.839 కోట్ల) పెట్టుబడులను తెలంగాణ కేంద్రంగా పురుడుపోసుకుంటోన్న స్టార్టప్ కంపెనీల్లో పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వాల్ష్ కర్రా హోల్డింగ్స్ సహ వ్యవస్థాపకులు ఫణి కర్రా, గ్రేగ్ వాల్ష్ ముఖ్యమంత్రి బృందానికి వివరించారు.
ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ల్యాండ్ పూలింగ్ ద్వారా వేయి ఎకరాల్లో లేఅవుట్లు అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
అవుటర్ రింగ్ రోడ్డుకు, ప్రాంతీయరింగ్ రోడ్డుకు మధ్య లేఔట్ లు అభివృద్ధి చేసి వేలం వేస్తే హెచ్ఎండిఏకు ఆదాయంతోపాటు, మధ్యతరగతి వారికి ధరలు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ల్యాండ్ పూలింగ్ ద్వారా వేయి ఎకరాల్లో లేఅవుట్లు అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇన్ ముల్ నర్వ లో 95.25 ఎకరాల్లో లేఔట్ అభివృద్ధి చేసి, లేమూరులో 83.48 ఎకరాల్లో లేఔట్లను అభివృద్ధి చేయాలని గతంలో నిర్ణయించారు.
హెచ్ఎండిఏ లేఅవుట్ల కోసం గుర్తించిన భూముల్లో దాదాపు సాగులో లేనివే. అవి అసైన్డ్ కేటగిరీలో ఉండటంతో రైతులతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సేకరించిన భూమిని హెచ్ఎండిఏ అభివృద్ధి చేసి లేఅవుట్ కింద తీర్చిదిద్దుతుంది. రైతు భూ యజమానిగా, హెచ్ఎండిఏ డెవలపర్ గా ఉంటుంది. ఇందులో రైతులకు 60 శాతం బదిలీ చేస్తుంది. మిగతా 40 శాతం హెచ్ఎండిఏ విక్రయిస్తుంది. ల్యాండ్ పూలింగ్ లో భాగంగా రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్గిరి పరిధిలో దాదాపు 924.28 ఎకరాలు అధికారులు పరిశీలించారు.
ఆదాయం పెంపు దిశగా అడుగులు
హెచ్ఎండిఏ పై ఇప్పటికీ ప్రభుత్వం దృష్టి సారించింది. రూ. 500 కోట్ల వరకు మౌలిక వసతులకు కేటాయించింది. అవుటర్ రింగ్ రోడ్డుకు, ప్రాంతీయరింగ్ రోడ్డుకు మధ్య లేఔట్ లు అభివృద్ధి చేసి వేలం వేస్తే హెచ్ఎండిఏకు ఆదాయంతోపాటు, మధ్యతరగతి వారికి ధరలు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు. చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ లో 355, బోగారంలో 125, ప్రతాప్సింగారంలో 152, నాదర్గుల్ లో 91 ఎకరాల్లో లేఅవుట్లు తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
ఎల్ఆర్ఎస్ ప్రక్రియకు మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం
ఈ వారం నుంచి దరఖాస్తుల పరిశీలన ప్రారంభం
ప్లాట్లకు మూడు దశల్లో, లేఔట్లకు నాలుగు దశల్లో పరిశీలన
రాష్ట్రంలో అక్రమ లేఅవుట్లు ప్లాట్లు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూడు నెలల్లో దరఖాస్తులను పరిశీలించి అర్హమైన వాటిని క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఆగస్టు మొదటి వారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి ఎం దానకిషోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాట్ల దరఖాస్తులను మూడు దశల్లో లేఅవుట్ల దరఖాస్తులను నాలుగు దశల్లో పరిశీలించాలని నిబంధనలో పేర్కొన్నారు. అనంతరం వాటిలో అర్హమైన వాటిని నిర్ధారిత ఫీజులు వసూలు చేసి క్రమబద్ధీకరిస్తారు.
25 లక్షల దరఖాస్తులు
స్థలాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 2020లో సుమారు 25 లక్షల మంది దరఖాస్తు చేశారు కోర్ట్ లో కేసులు ఉండడంతో అవి పరిష్కారానికి నోచుకోలేదు. ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి మాత్రం కోర్టు తీర్పునకు లోబడి ఉంటామంటూ అఫిడవిట్ తీసుకొని అధికారులు అనుమతులు ఇస్తున్నారు. గత డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన నాటినుండి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉత్తర్వుల జారీ తో దరఖాస్తుదారులను హర్షం వ్యక్తం అవుతుంది.
ముందుగా సిజిజి పరిశీలన
ఆ దరఖాస్తులను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ముందుగా పరిశీలిస్తుంది. వివిధ నిబంధనల ఆధారంగా కంప్యూటర్ ద్వారా వడపోస్తుంది. ఆయా ఆస్తులు నిషేధిత జాబితాలో ఉంటే గుర్తించి దరఖాస్తుదారులకు సమాచారం పంపుతుంది. దరఖాస్తుదారులు అవసరమైన పూర్తిస్థాయి పత్రాలు ఇవ్వకుంటే దానిపైన సమాచారాన్ని పంపుతుంది.
సి జి జి వడపోత తరువాత మిగిలిన దరఖాస్తులను రెవెన్యూ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, పంచాయతీ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంది. నాళాలు, చెరువులు, వారసత్వ సంపద, శిఖం, దేవాదాయ, ఇనాం భూములు తదితర కోణాల్లో పరిశీలించి అభ్యంతరాలను నమోదు చేస్తారు. ఆయా వివరాలను ఇప్పటికే సిజిజి రూపొందించిన సెల్ ఫోన్ యాప్ లలో నమోదు చేస్తారు
రెండో దశలో
మరింత అధ్యయనం చేసి అర్హమైన నిర్ధారిత ఫీజు చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేస్తారు. క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హమైనవి కాదని గుర్తిస్తే ఆ దరఖాస్తులను తిరస్కరిస్తారు. ఆ సమాచారాన్ని దరఖాస్తుదారులకు పంపుతారు.
మూడో దశలో
అర్హమైన దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించినట్లు నిర్ధారించాక క్రమబద్ధీకరణ ఉత్తర్వులను జారీ చేస్తారు.
లే అవుట్ల విషయంలో అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల ఆధ్వర్యంలోని వివిధ విభాగాల అధికారులు పరిశీలన చేస్తారు
సహాయ కేంద్రాల ఏర్పాటు
క్రమబద్ధీకరణ దరఖాస్తులపై జారీచేసిన నోటీసులకు సంబంధించిన సమస్యలను నివృత్తి చేసేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లు స్థానిక సంస్థ కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాల దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలు భాగస్వాములయ్యే అన్ని స్థాయిల సిబ్బంది అధికారులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
హైదరాబాద్ కు అంతర్జాతీయ ఐటి కంపనీల వరద పెరిగింది. డజనుకు పైగా ప్రముఖ అంతర్జాతీయ ఐటి కంపనీలు ఐటి స్థావరంగా ఉన్న పశ్చిమ హైదరాబాద్ లో అడ్డా వేస్తున్నాయి. ఇలా వచ్చిన కంపనీలలో కొన్ని భారత్ లో మొదటి కార్యలయలున్నాయి. భారత్ లో అడుగుపెట్టాలనుకున్న ఐటి కంపనీలు ఇలా హైదరాబాద్ లోనే తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయి.
అమెరికాకు చెందిన ష్యూర్, మైక్రాన్ టెక్నాలజీ, ఎఫ్5 నెట్‌వర్క్స్, మ్యాథ్‌వర్క్స్, క్లీన్ హార్బర్స్, కాండ్యూయెంట్, లెగాతో హెల్త్ టెక్నాలజీస్, త్రైవ్ డిజిటల్, బాంబార్డియర్ వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. చైనాకు థందర్ సాఫ్ట్ వేర్ టెక్ గత వారంలో ప్రారంభించబడింది. ఇంకా చాలా సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించటానికి సంప్రదింపులు జరుపుతున్నాయి.
ఐటి కంపనీలకు అనువైన వాతావరణం, మౌలికసదుపాయాలు కల్పన, సాంకేతిక నిపుణుల లభ్యత పుష్కలంగా హైదరాబాద్ లో ఉండడం వల్ల కంపనీలు క్యూ కడుతున్నాయి. ఇంకా ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉండడం వల్ల కంపనీలు వరదలా వచ్చిపడుతున్నాయి.
ఇలా కంపనీలు రావడం వల్ల ఉద్యోగఅవకాశాలు పెరగడమే కాకుండా కమర్షియల్ ఆఫీస్ స్పేస్ లకు గిరాకి పెరుగుతుంది.
ఇదివరకు ఏదైనా కంపనీ భారత్ లో తమ కార్యకలాపాలు ప్రారంభించాలనుకుంటే బెంగలూరు లో కార్యాలయాలను ఏర్పాటుచేసుకునేది. ఇప్పుడు రూటు మార్చి హైదరాబాద్ లో ఆఫీసులను పెడుతున్నాయి.
హైదరాబాద్‌లో నగరవాసులకు ట్రాఫిక్ నుండి కాస్త ఊరట లభించినట్లే. అమీర్‌పేట, ఎల్బీ నగర్ మధ్య ప్రయాణించే వారికి ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న మెట్రో కల నిజమయింది. అమీర్‌పేట నుండి ఎల్బీ నగర్ వరకు మెట్రో రైలు ప్రయాణం ప్రారంభం అయింది. గవర్నర్ నరసింహన్ అమీర్ పేట మెట్రో స్టేషన్లో జెండా ఊపి మెట్రో రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్ తదితరులు అమీర్‌పేట నుండి ఎల్బీ నగర్ వరకు మెట్రో రైలు ప్రయానించారు.
ఎల్బీనగర్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మెట్రో రైలు సేవలను వినియోగించుకోవడం ద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని, తద్వారా కాలుష్యాన్ని సైతం నియంత్రించవచ్చన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అందరికీ సౌకర్యంగా ఉండేలా ప్రతి మెట్రో స్టేషన్‌ను తీర్చిదిద్దామని, వీటి నిర్మాణంలో అన్ని నాణ్యతా ప్రమాణాలు పాటించామన్నారు.
ఈ రూట్లో మొత్తం 17 స్టేషన్లుండగా.. నాలుగు మినహా మిగతాచోట్ల ఇప్పటివరకు పార్కింగ్ వసతులు అందుబాటులో లేవు. మెట్రో స్టేషన్ పార్కింగ్ వసతి లేని చోట స్టేషన్ కు కొద్ది దూరంలో ఫ్రీ పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేయడమైనది.
ఈ మార్గం ప్రారంభంతో ఎల్బీనగర్ నుంచి బయలుదేరిన వ్యక్తి 29 కిలో మీటర్ల మియాపూర్ కు 52 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రారంభంలో ప్రతి ఐదు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైళ్లు 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి.
హైదరాబాద్ మెట్రో కారిడార్ 1 మియాపూర్ నుండి ఎల్బీ నగర్ వరకు మొత్తం 27 కిలోమీటర్లు. ఇందులో మియాపూర్ నుండి అమీర్‌పేట వరకు మొదటి దశలో ప్రారంభించారు. ఇంకా కారిడార్ ౩ నాగోల్ నుండి రాయదర్గ వరకు మొత్తం 29 కిలోమీటర్లు ఇందులో నాగోల్ నుండి అమీర్ పేట వరకు మొదటి దశలో ప్రారంభించారు. రెండో దశగా కారిడార్ 1లో అమీర్ పేట నుండి ఎల్బీనగర్ వరకు ఇప్పుడు ప్రారంభించారు. మొత్తానికి కారిడార్ 1 మొత్తం పూర్తయింది. కారిడార్ ౩ లో అమీర్‌పేట నుండి హైటెక్ సిటి వరకు ఈ ఏడాది నవంబర్ లో పూర్తీ కావచ్చని అధికారులు చెపుతున్నారు.
గతంలో ౩౦౦ అడుగుల వెడల్పుతో 338 కిలోమీటర్ల మేర రీజినల్ రింగురోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాని ఆ ౩౦౦ అడుగుల వెడల్పు ఉన్న రోడ్డు భవిష్యత్తులో పెరగబోయే ట్రాఫిక్ ను తట్టుకునే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో 500 అడుగుల వెడల్పుతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ రీజినల్ రింగురోడ్డును సాధారణ రహదారిగా కాకుండా ప్రపంచస్థాయి ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించాలని అధికారులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఆ దిశగా డీపీఆర్ తయారుచేయాలని, దీనికి నిధుల మంజూరు కోసం కేంద్రంతో మాట్లాడుతానని చెప్పారు. సీఎం గురువారం ప్రగతిభవన్‌లో సీఎస్ ఎస్కే జోషి, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ గణపతిరెడ్డి ఇతర అధికారులతో సమావేశమై రీజినల్ రింగురోడ్డుపై చర్చించారు. రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కూడా సీఎం ఫోన్‌లో మాట్లాడారు. హైదరాబాద్ నగరం దేశంలోనే గొప్ప కాస్మోపాలిటన్ నగరం. ఇక్కడి వాతావరణ అనుకూలత , సామరస్య జీవన విధానం కారణంగా ఈ నగరం ఇంకా అభివృద్ది చెందుతుంది. దేశం నలుమూలల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు పెరుగుతాయి. ఇప్పుడున్న ఔటర్ రింగురోడ్డు భవిష్యత్ అవసరాలను తీర్చలేదు. కాబట్టి హైదరాబాద్ చుట్టూ మరో రింగురోడ్డును రీజినల్ రింగురోడ్డు పేరుతో (RRR-Regional Ring Road) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సంగారెడ్డి- గజ్వేల్- చౌటుప్పల్- మాల్- కడ్తాల్- షాద్‌నగర్- చేవెళ్ల- కంది పట్టణాలను కలుపుతూ 338 కిలోమీటర్ల మేర 500 అడుగుల వెడల్పుతో ఈ రహదారి నిర్మాణం జరుగాలి. ముంబై- పుణె, అహ్మదాబాద్- వడోదర మధ్య ప్రస్తుతమున్న ఎక్స్‌ప్రెస్‌వేల కంటే మన రీజినల్ రింగురోడ్డు గొప్పగా ఉండాలి. విజయవాడ, ముంబై, బెంగళూరు, నాగపూర్ నగరాలకు వెళ్లే మార్గంలో జంక్షన్లను బాగా అభివృద్ధి చేయాలి. ఆ నాలుగు జంక్షన్ల్ల వద్ద ప్రభుత్వం 300 ఎకరాల నుంచి 500 ఎకరాల వరకు సేకరిస్తుంది. ఆ స్థలంలో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి. అక్కడ పార్కింగ్, ఫుడ్‌కోర్టులు, రెస్ట్‌రూంలు, పార్కులు, పిల్లల ప్లే ఏరియా, షాపింగ్ మాల్స్, మంచినీరు, టాయిలెట్లు.. ఇలా అన్ని రకాల వసతులుండాలి. దేశంలోనే ఈ రహదారి అతిగొప్ప రహదారిగా ఉండాలి. ఇందుకోసం మంచి రహదారులు, రహదారుల పక్కన సకల సౌకర్యాలు కలిగిన దేశాల్లో పర్యటించి అధ్యయనం చేయాలి అని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు.
హైదరాబాద్ హెచ్ఎండిఏ (HMDA)పరిధిలో 28 కొత్త మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. హైదరాబాద్ శివారులో గ్రామపంచాయితీలు గా ఉండి, జనావాసాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించిన ప్రభుత్వం, వాటిని కొత్త మున్సిపాలిటీలుగా మార్చింది.
మెదక్ జిల్లాలో 2 మున్సిపాలిటీలు, మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లాలో 13 మున్సిపాలిటీలు, రంగారెడ్డి జిల్లాలో 8 మున్సిపాలిటీలు, సంగారెడ్డి జిల్లాలో 3 మున్సిపాలిటీలు, యాదాద్రి భువనగిరి జిల్లా (2) కొత్తగా వెలిశాయి. అదే యాదాద్రి జిల్లాలో వైటిడిఏ (YTDA)పరిధిలో యాదగిరిగుట్టను కూడా మున్సిపాలిటీ చేశారు.
సంగారెడ్డి జిల్లా (౩) : బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్
యాదాద్రి భువనగిరి జిల్లా (2+1) : చౌటుప్పల్, పోచంపల్లి, యాదగిరిగుట్ట
పైన చెప్పిన ప్రాంతాలలో రోడ్లు మరియు ఇతర ప్రజా సౌకర్యాలు మెరుగుపడి రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతాలలో ప్లాట్ల పై పెట్టుబడి ఎక్కువ లాభాలను ఇస్తుంది.
* హైదరాబాద్ లో ఉప్పల్, నాగోల్, సనత్‌నగర్, మేడ్చల్, కొంపల్లి ప్రాంతాలకు ఐటీ పరిశ్రమల విస్తరణ
*నగరంలో నూతన ఐటీ క్లస్టర్లకు అనుగుణంగా వసతుల కల్పన
*స్వల్పకాలిక లక్ష్యాలతో కార్యాచరణ
*అవసరమైన చోట మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్లు
హైటెక్ సిటి, గచ్చిబౌలి లు ఐటీ కంపనీలకు అడ్డలుగా ఉన్నాయి. ఇప్పుడు ఐటీ కంపనీలను నగరం నలుదిశలా విస్తరించి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత నగరంలో ఐటీ పరిశ్రమ జాతీయసగటు కన్నా ఎక్కువగా వృద్ధిని నమోదు చేసుకుంటున్నదన్న మంత్రి కేటీఆర్, త్వరలోనే ఐటీ ఎగుమతుల విలువ రూ.లక్ష కోట్లకు చేరుకుంటుందని చెప్పారు. ఈ మేరకు పెరుగుతున్న ఐటీ పరిశ్రమకు అనుగుణంగా నగరంలో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసు, ట్రాఫిక్, విద్యుత్, రోడ్లు-భవనాల శాఖ, జీహెచ్‌ఎంసీ, మెట్రోరైలు, హెచ్‌ఎండీఏ తరఫున చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సమీక్షించారు.
ప్రస్తుతం ఉన్న ఐటీ క్లస్టర్లకు తోడుగా ఉప్పల్, నాగోల్, సనత్‌నగర్, మేడ్చల్, కొంపల్లివంటి ప్రాంతాలకు ఐటీ పరిశ్రమల విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యూహాలపై మంత్రి సమీక్షించారు. ముఖ్యంగా ప్రస్తుతం ఐటీ పరిశ్రమ ఉన్న గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై స్వల్పకాలిక లక్ష్యాలతో చేపట్టాల్సిన చర్యలపైన ప్రణాళికలు రూపొందించాలని టీఎస్‌ఐఐసీ అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతోపాటుగా నూతనంగా ఏర్పాటుకానున్న మరో ఐటీ క్లస్టర్ రాజేంద్రనగర్, బుద్వేల్‌లోనూ ఇప్పటి నుంచే అన్ని వసతులు ఉండేలా చూడాలని కోరారు. నూతనంగా ఏర్పాటు కాబోయే క్లస్టర్లతోపాటు ఇప్పటికే ఉన్న క్లస్టర్లలోనూ రోడ్ల విస్తరణ, మురుగునీటి కాల్వల నిర్మాణం, విద్యుత్, నీటిసరఫరా అంశాలపై పూర్తిస్థాయి కార్యాచరణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఐటీ రంగంలో ఐదేండ్లలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ విధానాల ఫలితంగా అనేక ఐటీ సంస్థలు నగరంలో నూతనంగా కార్యకలాపాలు చేపట్టేందుకు, ప్రస్తుతం ఉన్నవాటిని విస్తరించేందుకు ముందుకు వస్తున్నాయి . రానున్న ఐదేండ్లలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఐటీ రంగంలో రానున్నాయని తెలిపారు. అయితే ఈ పెరుగుదల ఒకేవైపు కాకుండా నగరంలోని నలుమూలలా వస్తే భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తవని, సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ పెరుగుదలలో భాగంగా అవసరమైన పోలీస్ స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాలు, అవకాశం ఉన్న చోట మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్లు వంటివి ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమావేశంలో టీఎస్‌ఐఐసీ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, ముగ్గురు పోలీసు కమిషనర్లు, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.