🔹 దేశ క్రీడా రంగానికి తెలంగాణ కేంద్ర బిందువుగా ఉండాలి
🔹 స్పోర్ట్స్ యూనివర్సిటీపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
దేశ క్రీడా రంగానికి తెలంగాణ కేంద్ర బిందువుగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఫోర్త్ సిటిలో భాగంగా తలపెట్టిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీపై ఉన్నతాధికారులతో చర్చించారు. రకరకాల క్రీడలు, అకాడమీలు, పాఠశాలలు, క్రీడా శిక్షణా సంస్థలన్నింటినీ ఒకే గొడుకు కిందకు తేవడంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీ రూపుదిద్దుకోవాలని ఆదేశించారు.దశాబ్దాల కిందటే ఆఫ్రో-ఏసియన్ గేమ్స్ కు ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్ భవిష్యత్తులో ఒలింపిక్స్ క్రీడలకు వేదికగా నిలవాలని ముఖ్యమంత్రి అభిలషించారు.ఒలింపిక్స్ నిర్వహించడమే కాకుండా మన క్రీడాకారులు పతకాలను దక్కించుకునేలా వర్సిటీని తీర్చిదిద్దాలని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిపుణులైన శిక్షకులతో శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు.మన దేశం నుంచి ఒలింపిక్స్‌లో రాణించే షూటింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, అర్చరీ, జావెలిన్ త్రో, హాకీకి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాత శిక్షణ ద్వారా పతకాలు సాధించే అవకాశాలు ఉన్న మిగతా క్రీడల్లో శిక్షణ ఇప్పించాలని సూచించారు.చిన్న తనంలోనే విద్యార్థుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాలను ఉపాధ్యాయలు గుర్తించాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాంటి విద్యార్థులందరికీ ఆయా క్రీడల్లో శిక్షణ ఇచ్చేలా ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు. ఆ పాఠశాలల్లో విద్యా బోధనతో పాటు క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండేలా శిక్షణ ఇప్పించాలన్నారు.ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన దేశాలు, క్రీడాకారుల వివరాలను సేకరించి, క్రీడాకారులు శ్రమించిన తీరు, క్రీడల పట్ల ఆయా దేశాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.యంగ్ ఇండియాకు తెలంగాణ ఒక బ్రాండ్ గా మారాలని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా పేరు పెట్టిన తరహాలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీకి కూడా యంగ్ ఇండియా పేరును ఖరారు చేసిన విషయాన్ని వారు గుర్తుచేశారు.
*✅ రీజినల్ రింగ్ రోడ్డు (RRR)పై ఇక రోజువారీ పరిశీలన**
✅ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంలో భూసేకరణ వేగం పెంచండి**
✅ రైతులకు న్యాయం జరిగేలా పారదర్శకత పాటించండి**
✅ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగానే అలైన్‌మెంట్ ఉండాలి**
✅ RRR ప్రగతిపై ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*
తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) దక్షిణ భాగం భూసేకరణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.
భూములిచ్చే రైతులకు న్యాయం చేస్తూ RRR భూసేకరణ పూర్తి పారదర్శకంగా జరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణ పనుల్లో పురోగతిపై సంబంధిత కలెక్టర్లు ఇకపై రోజూవారిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించాలని సీఎం పేర్కొన్నారు.
అర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ఔటర్ రింగ్ రోడ్డు (ORR), రీజినల్ రింగ్ రోడ్డు (RRR) మధ్య అనుసంధానానికి అనువుగా రహదారుల ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రధాన రహదారులకు అనుసంధానం చేసే ప్రదేశాలను ముందుగానే గుర్తించి నిరంతరం సాఫీగా ప్రయాణాలు సాగేందుకు వీలుగా నిర్మాణాలు ఉండాలని సీఎం అన్నారు.
భవిష్యత్తు అవసరాలే ప్రాతిపదికగా RRR అలైన్‌మెంట్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న వివిధ రకాల పరిశ్రమలు, సంస్థలకు ఉపయోగకరంగా ఈ రోడ్ల ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు.
ఆర్ఆర్ఆర్ కింద ఉత్తర భాగం సంగారెడ్డి – భువనగిరి – చౌటుప్పల్ మార్గంలో భూసేకరణ దాదాపుగా పూర్తి కాగా, ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంలోని (చౌటుప్పల్-ఆమన్‌గల్ -షాద్ నగర్ -సంగారెడ్డి (189.20 కి.మీ.)మార్గానికి సంబంధించి భూ సేకరణ,అలైన్‌మెంట్ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆ సూచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదిక తయారు చేసి త్వరగా అందజేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ విషయంలో ఏవైనా సాంకేతిక సమస్యలుంటే వెంటనే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని సీఎం చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
RRR, Regional Ring Road Hyderabad, Hyderabad Real estate, Hyderabad Development, Hyderabad Update
అంతర్జాతీయ అవసరాలు తీర్చేలా రూపుదిద్దుకుంటోన్న ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ) అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు.
ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్లు, మెట్రో రైల్ కనెక్టివిటీ అంశాలపై సీఎం చర్చించారు.
ఈ సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
హైదరాబాద్ లో ఛార్లెస్ స్క్వాబ్ టెక్నాలజీ డెవెలప్మెంట్ సెంటర్
డల్లాస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో కంపెనీ ప్రతినిధుల చర్చలు
ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. భారత్లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్ ఇదే కావటం విశేషం.అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ లో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గారు, మంత్రి శ్రీధర్ బాబు గారితో ఛార్లెస్ స్క్వాబ్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు డెన్నిస్ హోవార్డ్ గారు, రామ బొక్కా గారి సారథ్యంలో ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా టెక్నాలజీ అండ్ డెవెలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామని చెప్పారు. తమ కంపెనీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుకు కంపెనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు ఛార్లెస్ స్క్వాబ్ తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్‌కు పంపించనున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగంలోనూ హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించనుంది.
వివింట్ ఫార్మా (Vivint Pharma) రూ. 400 కోట్ల పెట్టుబడి
తెలంగాణ జీనోమ్ వ్యాలీలో ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రం ఏర్పాటుకు సంసిద్ధత
తెలంగాణలో పెట్టుబడులకు పేరొందిన కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి బృందం వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపుతోంది.హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వివింట్ ఫార్మా (Vivint Pharma) కంపెనీ ముందుకొచ్చింది. రూ.400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోయే ఈ కంపెనీ దాదాపు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం వివింట్ (Vivint Pharma) కంపెనీ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల అనంతరం పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలో వివింట్ (Vivint Pharma) కంపెనీ ఆర్ అండ్ డీ కేంద్రం ఉంది. సుమారు రూ. 70 కోట్లతో నెలకొల్పిన ఈ సదుపాయాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో విస్తరించేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా హైదరాబాద్ లో తన మొదటి తయారీ కర్మాగారాన్ని స్థాపించనుంది. జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులకు వివింట్ ఫార్మా (Vivint Pharma) ముందుకు రావటంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. తెలంగాణలో అన్ని పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని, జీనోమ్ వ్యాలీ ఔషద కంపెనీలను తప్పకుండా ఆకర్షిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో ముఖ్యమంత్రి బృందం భేటీ
తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యంపై సంప్రదింపులు
స్కిల్ డెవెలప్మెంట్, నెట్ జీరో, ఫ్యూచర్ సిటీ, సిటిజన్ హెల్త్ ప్రాజెక్టులపై ఆసక్తి
తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు ప్రపంచ బ్యాంక్ సంసిద్ధతను వ్యక్తం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు కలిసికట్టుగా రోడ్ మ్యాప్ను రూపొందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ప్రధానంగా స్కిల్ డెవెలప్మెంట్, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, నెట్ జీరో సిటీ, ఆరోగ్య సంరక్షణ, డయాగ్నస్టిక్స్, హెల్త్ ప్రొఫైల్ రంగాల్లో భాగస్వామ్యానికి అవసరమైన సంప్రదింపులు జరిగాయి.ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ఉన్నతాధికారులు శేషాద్రి, విష్ణు వర్ధన్ రెడ్డి, అజిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణం, జీవనోపాధి, నైపుణ్యాల వృద్ధి, ఉద్యోగాలు, ఆర్థిక సుస్థిరత తో పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల తమ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలన్నీఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తాము చేపట్టబోయే ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికన అమలు చేసి తీరుతామని ప్రకటించారు. అన్నింటిలోనూ అత్యంత పారదర్శకతను పాటిస్తామని స్పష్టం చేశారు. ప్రాంతాల వారీగా చేపట్టే ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, వాటి అమలును వేగవంతం చేసేందుకు వివిధ విభాగాలకు చెందిన నిపుణుల బృందం ఏర్పాటు చేయాలనే ఆలోచనలను ప్రపంచబ్యాంకు బృందంతో పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ అభివృద్ధికి ముఖ్యమంత్రి అనుసరిస్తున్న సమతుల్య దృక్పథం మంచి ఫలితాలను అందిస్తుందని ప్రపంచ బ్యాంకు బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. గతంలో భారత్ లో తమ భాగస్వామ్యంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు సానుకూల ఫలితాలు అందించాయని గుర్తు చేసింది. చర్చల సందర్భంగా నెట్ జీరో సిటీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చూపిన చొరవపై ప్రపంచ బ్యాంకు బృందం మరింత ఆసక్తిని ప్రదర్శించింది. ప్రజా పాలనతో పాటు రాష్ట్రంలో సమగ్ర సమతుల్య అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును చర్చల్లో పాలుపంచుకున్న ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్ ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం ప్రపంచ బ్యాంకు లాంటి అంతర్జాతీయ ద్రవ్యసంస్థలతో కలిసి పని చేయాలని నిశ్చయించటం ఇదే మొదటి సారి. తెలంగాణలో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, స్కిల్ యూనివర్శిటీ, సిటిజన్ హెల్త్‌కేర్, హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కీలకమైన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి అనుసరిస్తున్న భవిష్యత్తు వ్యూహాలకు ప్రపంచ బ్యాంకు మద్దతు మరింత ఊతమివ్వనుంది.
మెటీరియల్ సైన్స్ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన “కార్నింగ్ ఇన్‌కార్పొరేటేడ్” (Corning Incorporated) కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకు వచ్చింది. నైపుణ్యాలతో పాటు పరిశ్రమల్లో నూతన సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గారు, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు గారు ఎమర్జింగ్ ఇన్నొవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాల్డ్ వెర్క్లీరెన్ అధ్వర్యంలోని కార్నింగ్ (Corning) ప్రతినిధుల బృందంతో చర్చల అనంతరం అవగాహన ఒప్పంద పత్రాలపై అధికారికంగా సంతకాలు చేశారు. ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాలలో అత్యాధునిక పరిశోధన, అభివృద్ది కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంతో కార్నింగ్ (Corning) భాగస్వామిగా పనిచేస్తుంది. తెలంగాణలో ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం నెలకొల్పటంపై చర్చలు జరిపారు. 2025 నుంచి ఇందులో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమిస్తామని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH) సహకారంతో డాక్టర్ రెడ్డీస్ లిమిటెడ్, లారస్ ఫార్మా లిమిటెడ్ నిర్వహిస్తున్న ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ (ఎఫ్‌సిటి) హబ్‌లోనూ కార్నింగ్ కంపెనీ భాగస్వామ్యం పంచుకుంటుంది. ఫార్మాస్యూటికల్ మరియు కెమికల్ పరిశ్రమలలో ఆవిష్కరణలతో పాటు ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీలో Corning కంపెనీ తగిన సహకారం అందిస్తుంది. కొత్తగా అందుబాటులోకి తెస్తున్న అడ్వాన్స్డ్ ఫ్లో రియాక్టర్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కార్నింగ్ (Corning) కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి వివరించారు. ఈ అత్యాధునిక గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఫార్మా రంగం అభివృద్ధికి దోహదపడుతుంది. ఔషధాల ప్యాకేజింగ్ పరిశ్రమలో ఈ గ్లాస్ ట్యూబ్‌లను ఉపయోగిస్తారు. వీటి తయారీకి వినూత్నమైన వెలాసిటీ గ్లాస్-కోటింగ్ టెక్నాలజీని ఈ కంపెనీ వినియోగిస్తోంది. ఈ కొత్త సదుపాయంతో తెలంగాణలో ఇప్పటికే వేగంగా విస్తరిస్తున్న ఫార్మాస్యూటికల్ రంగంలో ఉత్పాదకత సామర్థ్యం మరింత మెరుగుపడుతుందనే అంచనాలున్నాయి.
*హెల్త్‌కేర్ లో ప్రపంచంలో పేరొందిన హెచ్‌సిఎ హెల్త్‌కేర్
హైదరాబాద్ లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది మార్చిలో ఇంక్యుబేషన్ ఫెసిలిటీని ప్రారంభించిన ఈ సంస్థ తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. తెలంగాణలో ఏర్పాటు చేసే కొత్త క్యాంపస్ కు నాలుగు లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. అమెరికా పర్యటనలో హెచ్‌సిఎ హెల్త్‌కేర్‌కు చెందిన ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుతో చర్చలు జరిపారు. హైదరాబాద్‌లో తమ హెల్త్ కేర్ సేవల విస్తరణ, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ప్రభుత్వం తగిన మద్దతు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌లో హెచ్‌సిఎ హెల్త్‌కేర్ తన కార్యకలాపాలను విస్తరిస్తున్నందుకు సంతోషం వ్యక్తపరిచారు. దీంతో కొత్త ఉద్యోగాలు లభించటంతో పాటు హెచ్‌సిఏ పెట్టుబడులు తెలంగాణను ఆరోగ్య సంరక్షణ రంగంలో మరింత ముందుకు తీసుకువెళుతుందన్నారు. హైదరాబాద్ లో హెచ్సీఏ ఏర్పాటు చేసే గ్లోబల్ సెంటర్ అర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ తో పాటు మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, అనలిటిక్స్ రంగంలో ప్రతిభకు పెద్దపీట వేయనుంది. హెచ్సీఏ హెల్త్‌కేర్ గ్లోబల్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలకమైన హబ్ గా ఉపయోగపడుతుంది. ఈ చర్చల సందర్భంగా హెచ్‌సిఎ హెల్త్‌కేర్ గ్లోబల్ కెపాబిలిటీస్ నెట్‌వర్క్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎమిలీ డంకన్ మాట్లాడుతూ కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి తమ విజన్కు అనుగుణంగా ఉన్న హైదరాబాద్‌లో హెల్త్ కేర్ సేవలను విస్తరిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ అందుబాటులో ఉన్న ప్రతిబా వనరులు, మౌలిక సదుపాయాలు కొత్తగా ఏర్పాటు చేయబోయే గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ కు బలమైన పునాదులు వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సరికొత్త మైలురాయిగా నిలుస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. హెల్త్ కేర్ రంగంలో హైదరాబాద్ గణనీయమైన వృద్ధి సాధిస్తుందని, హెచ్సీఏకు ప్రభుత్వం తరఫున తగిన సహకారం అందిస్తామని చెప్పారు. ఈ గ్లోబల్ సెంటర్ త్వరలోనే పని ప్రారంభిస్తుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. బ్రిటన్ తో పాటు ఇరవై దేశాల్లో పలు శస్త్రచికిత్స కేంద్రాలతో పాటు, అత్యవసర సంరక్షణ కేంద్రాలు మరియు ఫిజిషియన్ క్లినిక్‌లతో దాదాపు 188 ఆసుపత్రులు, 2,400 ఆంబులేటరీ సైట్‌లను ఈ సంస్థ నిర్వహిస్తోంది.
*-స్వచ్ఛ్ బయో రూ.1000 కోట్ల పెట్టుబడి.. 500 మందికి ఉద్యోగాలు*
బయో ఫ్యూయల్స్ తయారీ సంస్థ స్వచ్ఛ్ బయో తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధపడింది. త్వరలోనే తెలంగాణలో సెకండ్ జనరేషన్ సెల్యులోసిక్ బయో ఫ్యూయల్ ప్లాంట్ నెలకొల్పనుంది. మొదటి దశలో దాదాపు రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ నిర్మించనుంది. ఈ ప్లాంట్ ఏర్పాటులో 250 మందికి ప్రత్యక్షంగా, 250 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో పాటు తెలంగాణ అధికార ప్రతినిధి బృందంతో స్వచ్ఛ్ బయో ఛైర్ పర్సన్ ప్రవీణ్ పరిపాటి చర్చలు జరిపారు. స్వచ్ఛ బయోతో అంతర్జాతీయ భాగస్వామిగా ఉన్న సుగనిత్ బయో రెన్యువబుల్స్ కంపెనీ బయోమాస్, సెల్యులోజ్ నుండి జీవ ఇంధనాలు మరియు జీవ రసాయనాలను ఉత్పత్తి చేసే పేటేంట్ పొందటంతో పాటు అవసరమైన సాంకేతికతను అభివద్ధి చేసింది. ఈ కంపెనీ పెట్టుబడులు రాష్ట్రంలో సుస్థిరమైన, పర్యావరణ అనుకూలమైన వృద్ధికి దోహదపడనుంది. అందుకే పెట్టుబడులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ వికేంద్రీకృత అభివృద్ధి దృక్పథం తమను ఆకట్టుకుందని కంపెనీ ఛైర్మన్ ప్రవీణ్ పరిపాటి అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవటం తమకు ఆనందంగా ఉందన్నారు. రాబోయే కాలంలో మరిన్నిప్లాంట్లు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని బయో ఫ్యూయల్స్ హబ్‌గా మార్చాలనే తమ ఆలోచనలను అధికారులతో పంచుకున్నారు.
*హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ ఇండియాకు కొత్త చిరునామా*
*-తెలంగాణ అంటేనే పెట్టుబడుల గమ్యస్థానం.. వ్యాపారాలకు సులభంగా కొత్త పారిశ్రామిక విధానం*
*-అమెరికాలో రౌండ్ టేబుల్ సమావేశంలో పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి*
తెలంగాణలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమల అవసరాలు, అభిరుచికి అనుగుణంగా తమ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తుందని ప్రకటించారు. అమెరికాలో ఉన్న వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణలో ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనేది తమ సంకల్పమని అన్నారు. తెలంగాణ అంటేనే వ్యాపారం.. తెలంగాణ అంటేనే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తామని చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను ఈ సందర్భంగా సీఎం వివరించారు. త్వరలోనే హైదరాబాద్లో నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని చెప్పారు. ఇది భారత దేశపు భవిష్యత్తుకు చిరునామాగా నిలుస్తుందని అభిప్రాయ పడ్డారు. దేశంలోనే జీరో కార్బన్ సిటీ ఇక్కడ ఏర్పడతుందని అన్నారు. ఫ్యూచర్ సిటీలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్తో పాటు, మెడికల్, టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్‌వేర్, ఫార్మా విలేజ్లను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ఫ్యూచర్ సిటీ రాష్ట్ర అభివృద్దితో పాటు పరిశ్రమలకు సిరుల పంట పండిస్తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణను సులభతరం చేస్తామని సీఎం ప్రకటించారు. అటువంటి సరికొత్త ఆలోచనలతోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. సోమవారం న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వర్కింగ్ లంచ్ అనంతరం ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో రౌండ్‌టేబుల్ సమావేశమయ్యారు. ఫార్మా, ఐటీ, టెక్నాలజీ, ఈవీ, బయోటెక్, షిప్పింగ్ రంగాల్లో పేరొందిన కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నఛైర్‌పర్సన్‌లు, సీఈవోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామిక క్లస్టర్లుగా విభజించి, అభివృద్ధి చేసేందుకు రూపొందించిన భవిష్యత్తు ప్రణాళికలు, తెలంగాణ చరిత్రపై ముఖ్యమంత్రి ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తన మనసులోని మాటలతో పాటు తమ ప్రభుత్వం ఏం కోరుకుంటుందో.. తన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలేమిటో వెల్లడిస్తానంటూ అందరినీ ఉత్సాహపరిచారు. ముఖ్యమంత్రి హోదాలో ఇది తన మొదటి అమెరికా పర్యటన అని.. ఇక్కడి నుంచి వీలైనన్ని పెట్టుబడులు తెలంగాణకు తీసుకెళ్లాలలన్నదే తన లక్ష్యమని ప్రకటించారు. పెట్టుబడుల గమ్యస్థానంగా దేశంలోనే అందరినీ ఆకర్షిస్తున్న తెలంగాణకు ఉన్న అనుకూలతలన్నింటినీ ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్, లైఫ్-సైన్స్, ఫార్మా రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలలో బలమైన పునాదులు వేసుకుందని చెప్పారు. కోవిడ్ను అధిగమించేందుకు మిలియన్ల కొద్దీ వ్యాక్సిన్‌లను తయారు చేసి ప్రపంచానికి సాయం చేసిందని అన్నారు. తెలంగాణలో అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని, అద్భుతమైన ప్రతిభ సంపద సిద్ధంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చే పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమమైన మద్దతును అందిస్తుందని ప్రకటించారు. నిజాంలు నిర్మించిన 425 సంవత్సరాల పురాతనమైన హైదరాబాద్, ఇంచుమించుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో సమకాలీనంగా ఉండటం ఆసక్తి రేపుతోందని అన్నారు. అభిరుచితో పాటు అద్భుతమైన దూరదృష్టితో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ప్రపంచ పారిశ్రామికవేత్తలందరూ ఒకసారి తెలంగాణకు రావాలని, హైదరాబాద్ నగరాన్ని సందర్శించాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. హైదరాబాద్లో ఉన్న అనుకూలతలతో పాటు అక్కడున్న అవకాశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కలిసికట్టుగా గొప్ప భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణను చైనాకు ప్రత్యామ్నాయ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి దార్శనికతను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలకు వివరించారు. ప్రపంచంలోనే టాప్ టెన్ సిటీల్లో ఒకటిగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామని, ఆ దిశగా రూపొందించిన భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించారు. ఈ సమావేశం తెలంగాణలో కొత్త పెట్టుబడులకు మరింత ఊతమిస్తుందనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. కార్నింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాల్డ్ వెర్క్లీరెన్, కేకేఆర్ పార్టనర్ దినేష్ పలివాల్, సిగ్నా ఇంటర్నేషనల్ పబ్లిక్ పాలసీ హెడ్ ఎక్రమ్ సర్పర్, న్యూజెర్సీ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ బిల్ నూనన్, సేఫ్‌సీ గ్రూప్ ఛైర్మన్ ఎస్వీ అంచన్, టిల్మాన్ హోల్డింగ్స్ ఛైర్మన్ సంజీవ్ అహుజా, అమ్నీల్ ఫార్మా కో సీఈవో చింటూ పటేల్, జేపీ మోర్గాన్ చేజ్ ఈడీ రవి లోచన్ పోలా, ఆక్వాటెక్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్) సుబ్బారావు, యాక్సెంచర్ ఎండీ అమిత్కుమార్, డెలాయిట్ ఎండీ పునిత్ లోచన్, హాబిట్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వీర బుద్ధి, బీఎన్వై మెల్లన్ ఎండీ అట్లూరి, పేస్ యూనివర్సిటీ డీన్ డా. జోనాథన్ హిల్, అకుజెన్ చీఫ్ సైంటిఫిక్ హెడ్ అరుణ్ ఉపాధ్యాయ, ఎస్ అండ్ పీ గ్లోబల్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ స్వామి కొచ్చెర్లకోట, ఇంటర్కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్ ఎండీ అశ్విని పన్సే ఈ సమావేశంలో పాల్గొన్నారు.