*✅ రీజినల్ రింగ్ రోడ్డు (RRR)పై ఇక రోజువారీ పరిశీలన**
✅ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంలో భూసేకరణ వేగం పెంచండి**
✅ రైతులకు న్యాయం జరిగేలా పారదర్శకత పాటించండి**
✅ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగానే అలైన్‌మెంట్ ఉండాలి**
✅ RRR ప్రగతిపై ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*
తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) దక్షిణ భాగం భూసేకరణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.
భూములిచ్చే రైతులకు న్యాయం చేస్తూ RRR భూసేకరణ పూర్తి పారదర్శకంగా జరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణ పనుల్లో పురోగతిపై సంబంధిత కలెక్టర్లు ఇకపై రోజూవారిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించాలని సీఎం పేర్కొన్నారు.
అర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ఔటర్ రింగ్ రోడ్డు (ORR), రీజినల్ రింగ్ రోడ్డు (RRR) మధ్య అనుసంధానానికి అనువుగా రహదారుల ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రధాన రహదారులకు అనుసంధానం చేసే ప్రదేశాలను ముందుగానే గుర్తించి నిరంతరం సాఫీగా ప్రయాణాలు సాగేందుకు వీలుగా నిర్మాణాలు ఉండాలని సీఎం అన్నారు.
భవిష్యత్తు అవసరాలే ప్రాతిపదికగా RRR అలైన్‌మెంట్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న వివిధ రకాల పరిశ్రమలు, సంస్థలకు ఉపయోగకరంగా ఈ రోడ్ల ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు.
ఆర్ఆర్ఆర్ కింద ఉత్తర భాగం సంగారెడ్డి – భువనగిరి – చౌటుప్పల్ మార్గంలో భూసేకరణ దాదాపుగా పూర్తి కాగా, ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంలోని (చౌటుప్పల్-ఆమన్‌గల్ -షాద్ నగర్ -సంగారెడ్డి (189.20 కి.మీ.)మార్గానికి సంబంధించి భూ సేకరణ,అలైన్‌మెంట్ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆ సూచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదిక తయారు చేసి త్వరగా అందజేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ విషయంలో ఏవైనా సాంకేతిక సమస్యలుంటే వెంటనే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని సీఎం చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
RRR, Regional Ring Road Hyderabad, Hyderabad Real estate, Hyderabad Development, Hyderabad Update
66 total views, 3 views today