హైదరాబాద్ లో హెచ్సీఏ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌

*హైదరాబాద్ లో హెచ్సీఏ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌*

*- తెలంగాణ హెల్త్ కేర్ రంగంలో మరో ముందడుగు*

*- 400,000 చదరపు అడుగుల విస్తీర్ణం లీజుకు

*హెల్త్‌కేర్ లో ప్రపంచంలో పేరొందిన హెచ్‌సిఎ హెల్త్‌కేర్

హైదరాబాద్ లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది మార్చిలో ఇంక్యుబేషన్ ఫెసిలిటీని ప్రారంభించిన ఈ సంస్థ తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. తెలంగాణలో ఏర్పాటు చేసే కొత్త క్యాంపస్ కు నాలుగు లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. అమెరికా పర్యటనలో హెచ్‌సిఎ హెల్త్‌కేర్‌కు చెందిన ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుతో చర్చలు జరిపారు. హైదరాబాద్‌లో తమ హెల్త్ కేర్ సేవల విస్తరణ, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ప్రభుత్వం తగిన మద్దతు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌లో హెచ్‌సిఎ హెల్త్‌కేర్ తన కార్యకలాపాలను విస్తరిస్తున్నందుకు సంతోషం వ్యక్తపరిచారు. దీంతో కొత్త ఉద్యోగాలు లభించటంతో పాటు హెచ్‌సిఏ పెట్టుబడులు తెలంగాణను ఆరోగ్య సంరక్షణ రంగంలో మరింత ముందుకు తీసుకువెళుతుందన్నారు. హైదరాబాద్ లో హెచ్సీఏ ఏర్పాటు చేసే గ్లోబల్ సెంటర్ అర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ తో పాటు మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, అనలిటిక్స్ రంగంలో ప్రతిభకు పెద్దపీట వేయనుంది. హెచ్సీఏ హెల్త్‌కేర్ గ్లోబల్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలకమైన హబ్ గా ఉపయోగపడుతుంది. ఈ చర్చల సందర్భంగా హెచ్‌సిఎ హెల్త్‌కేర్ గ్లోబల్ కెపాబిలిటీస్ నెట్‌వర్క్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎమిలీ డంకన్ మాట్లాడుతూ కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి తమ విజన్కు అనుగుణంగా ఉన్న హైదరాబాద్‌లో హెల్త్ కేర్ సేవలను విస్తరిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ అందుబాటులో ఉన్న ప్రతిబా వనరులు, మౌలిక సదుపాయాలు కొత్తగా ఏర్పాటు చేయబోయే గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ కు బలమైన పునాదులు వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సరికొత్త మైలురాయిగా నిలుస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. హెల్త్ కేర్ రంగంలో హైదరాబాద్ గణనీయమైన వృద్ధి సాధిస్తుందని, హెచ్సీఏకు ప్రభుత్వం తరఫున తగిన సహకారం అందిస్తామని చెప్పారు. ఈ గ్లోబల్ సెంటర్ త్వరలోనే పని ప్రారంభిస్తుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. బ్రిటన్ తో పాటు ఇరవై దేశాల్లో పలు శస్త్రచికిత్స కేంద్రాలతో పాటు, అత్యవసర సంరక్షణ కేంద్రాలు మరియు ఫిజిషియన్ క్లినిక్‌లతో దాదాపు 188 ఆసుపత్రులు, 2,400 ఆంబులేటరీ సైట్‌లను ఈ సంస్థ నిర్వహిస్తోంది.

66 total views, 3 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *