హైదరాబాద్ లో ఛార్లెస్ స్క్వాబ్ టెక్నాలజీ డెవెలప్మెంట్ సెంటర్

హైదరాబాద్ లో ఛార్లెస్ స్క్వాబ్ టెక్నాలజీ డెవెలప్మెంట్ సెంటర్

డల్లాస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో కంపెనీ ప్రతినిధుల చర్చలు

ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. భారత్లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్‌ ఇదే కావటం విశేషం.అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌ లో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గారు, మంత్రి శ్రీధర్ బాబు గారితో ఛార్లెస్ స్క్వాబ్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు డెన్నిస్ హోవార్డ్ గారు, రామ బొక్కా గారి సారథ్యంలో ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా టెక్నాలజీ అండ్ డెవెలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామని చెప్పారు. తమ కంపెనీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుకు కంపెనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుకు ఛార్లెస్ స్క్వాబ్ తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్‌కు పంపించనున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగంలోనూ హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించనుంది.

177 total views, no views today

కార్నింగ్ ఇన్‌కార్పొరేటేడ్ కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధి

మెటీరియల్‌ సైన్స్‌ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన “కార్నింగ్ ఇన్‌కార్పొరేటేడ్” (Corning Incorporated) కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకు వచ్చింది. నైపుణ్యాలతో పాటు పరిశ్రమల్లో నూతన సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గారు, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు గారు ఎమర్జింగ్ ఇన్నొవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాల్డ్‌ వెర్క్లీరెన్ అధ్వర్యంలోని కార్నింగ్ (Corning) ప్రతినిధుల బృందంతో చర్చల అనంతరం అవగాహన ఒప్పంద పత్రాలపై అధికారికంగా సంతకాలు చేశారు. ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాలలో అత్యాధునిక పరిశోధన, అభివృద్ది కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంతో కార్నింగ్‌ (Corning) భాగస్వామిగా పనిచేస్తుంది. తెలంగాణలో ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం నెలకొల్పటంపై చర్చలు జరిపారు. 2025 నుంచి ఇందులో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమిస్తామని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH) సహకారంతో డాక్టర్ రెడ్డీస్ లిమిటెడ్, లారస్ ఫార్మా లిమిటెడ్ నిర్వహిస్తున్న ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ (ఎఫ్‌సిటి) హబ్‌లోనూ కార్నింగ్ కంపెనీ భాగస్వామ్యం పంచుకుంటుంది. ఫార్మాస్యూటికల్ మరియు కెమికల్ పరిశ్రమలలో ఆవిష్కరణలతో పాటు ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీలో Corning కంపెనీ తగిన సహకారం అందిస్తుంది. కొత్తగా అందుబాటులోకి తెస్తున్న అడ్వాన్స్డ్ ఫ్లో రియాక్టర్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కార్నింగ్ (Corning) కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి వివరించారు. ఈ అత్యాధునిక గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఫార్మా రంగం అభివృద్ధికి దోహదపడుతుంది. ఔషధాల ప్యాకేజింగ్ పరిశ్రమలో ఈ గ్లాస్ ట్యూబ్‌లను ఉపయోగిస్తారు. వీటి తయారీకి వినూత్నమైన వెలాసిటీ గ్లాస్-కోటింగ్ టెక్నాలజీని ఈ కంపెనీ వినియోగిస్తోంది. ఈ కొత్త సదుపాయంతో తెలంగాణలో ఇప్పటికే వేగంగా విస్తరిస్తున్న ఫార్మాస్యూటికల్ రంగంలో ఉత్పాదకత సామర్థ్యం మరింత మెరుగుపడుతుందనే అంచనాలున్నాయి.

69 total views, 3 views today

హైదరాబాద్ లో హెచ్సీఏ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌

*హైదరాబాద్ లో హెచ్సీఏ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌*

*- తెలంగాణ హెల్త్ కేర్ రంగంలో మరో ముందడుగు*

*- 400,000 చదరపు అడుగుల విస్తీర్ణం లీజుకు

*హెల్త్‌కేర్ లో ప్రపంచంలో పేరొందిన హెచ్‌సిఎ హెల్త్‌కేర్

హైదరాబాద్ లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది మార్చిలో ఇంక్యుబేషన్ ఫెసిలిటీని ప్రారంభించిన ఈ సంస్థ తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. తెలంగాణలో ఏర్పాటు చేసే కొత్త క్యాంపస్ కు నాలుగు లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. అమెరికా పర్యటనలో హెచ్‌సిఎ హెల్త్‌కేర్‌కు చెందిన ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుతో చర్చలు జరిపారు. హైదరాబాద్‌లో తమ హెల్త్ కేర్ సేవల విస్తరణ, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ప్రభుత్వం తగిన మద్దతు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌లో హెచ్‌సిఎ హెల్త్‌కేర్ తన కార్యకలాపాలను విస్తరిస్తున్నందుకు సంతోషం వ్యక్తపరిచారు. దీంతో కొత్త ఉద్యోగాలు లభించటంతో పాటు హెచ్‌సిఏ పెట్టుబడులు తెలంగాణను ఆరోగ్య సంరక్షణ రంగంలో మరింత ముందుకు తీసుకువెళుతుందన్నారు. హైదరాబాద్ లో హెచ్సీఏ ఏర్పాటు చేసే గ్లోబల్ సెంటర్ అర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ తో పాటు మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, అనలిటిక్స్ రంగంలో ప్రతిభకు పెద్దపీట వేయనుంది. హెచ్సీఏ హెల్త్‌కేర్ గ్లోబల్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలకమైన హబ్ గా ఉపయోగపడుతుంది. ఈ చర్చల సందర్భంగా హెచ్‌సిఎ హెల్త్‌కేర్ గ్లోబల్ కెపాబిలిటీస్ నెట్‌వర్క్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎమిలీ డంకన్ మాట్లాడుతూ కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి తమ విజన్కు అనుగుణంగా ఉన్న హైదరాబాద్‌లో హెల్త్ కేర్ సేవలను విస్తరిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ అందుబాటులో ఉన్న ప్రతిబా వనరులు, మౌలిక సదుపాయాలు కొత్తగా ఏర్పాటు చేయబోయే గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ కు బలమైన పునాదులు వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సరికొత్త మైలురాయిగా నిలుస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. హెల్త్ కేర్ రంగంలో హైదరాబాద్ గణనీయమైన వృద్ధి సాధిస్తుందని, హెచ్సీఏకు ప్రభుత్వం తరఫున తగిన సహకారం అందిస్తామని చెప్పారు. ఈ గ్లోబల్ సెంటర్ త్వరలోనే పని ప్రారంభిస్తుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. బ్రిటన్ తో పాటు ఇరవై దేశాల్లో పలు శస్త్రచికిత్స కేంద్రాలతో పాటు, అత్యవసర సంరక్షణ కేంద్రాలు మరియు ఫిజిషియన్ క్లినిక్‌లతో దాదాపు 188 ఆసుపత్రులు, 2,400 ఆంబులేటరీ సైట్‌లను ఈ సంస్థ నిర్వహిస్తోంది.

63 total views, 3 views today

తెలంగాణలో 2జీ బయో ఇథనాల్‌ ప్లాంట్‌

*తెలంగాణలో 2జీ బయో ఇథనాల్‌ ప్లాంట్‌*

*-స్వచ్ఛ్ బయో రూ.1000 కోట్ల పెట్టుబడి.. 500 మందికి ఉద్యోగాలు*

బయో ఫ్యూయల్స్ తయారీ సంస్థ స్వచ్ఛ్ బయో తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధపడింది. త్వరలోనే తెలంగాణలో సెకండ్ జనరేషన్ సెల్యులోసిక్ బయో ఫ్యూయల్ ప్లాంట్ నెలకొల్పనుంది. మొదటి దశలో దాదాపు రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ నిర్మించనుంది. ఈ ప్లాంట్ ఏర్పాటులో 250 మందికి ప్రత్యక్షంగా, 250 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో పాటు తెలంగాణ అధికార ప్రతినిధి బృందంతో స్వచ్ఛ్ బయో ఛైర్ పర్సన్ ప్రవీణ్ పరిపాటి చర్చలు జరిపారు. స్వచ్ఛ బయోతో అంతర్జాతీయ భాగస్వామిగా ఉన్న సుగనిత్ బయో రెన్యువబుల్స్ కంపెనీ బయోమాస్, సెల్యులోజ్ నుండి జీవ ఇంధనాలు మరియు జీవ రసాయనాలను ఉత్పత్తి చేసే పేటేంట్ పొందటంతో పాటు అవసరమైన సాంకేతికతను అభివద్ధి చేసింది. ఈ కంపెనీ పెట్టుబడులు రాష్ట్రంలో సుస్థిరమైన, పర్యావరణ అనుకూలమైన వృద్ధికి దోహదపడనుంది. అందుకే పెట్టుబడులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ వికేంద్రీకృత అభివృద్ధి దృక్పథం తమను ఆకట్టుకుందని కంపెనీ ఛైర్మన్ ప్రవీణ్ పరిపాటి అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవటం తమకు ఆనందంగా ఉందన్నారు. రాబోయే కాలంలో మరిన్నిప్లాంట్లు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని బయో ఫ్యూయల్స్ హబ్‌గా మార్చాలనే తమ ఆలోచనలను అధికారులతో పంచుకున్నారు.

51 total views, no views today

హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ ఇండియాకు కొత్త చిరునామా

*హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ ఇండియాకు కొత్త చిరునామా*

*-తెలంగాణ అంటేనే పెట్టుబడుల గమ్యస్థానం.. వ్యాపారాలకు సులభంగా కొత్త పారిశ్రామిక విధానం*

*-అమెరికాలో రౌండ్ టేబుల్ సమావేశంలో పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి*

తెలంగాణలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమల అవసరాలు, అభిరుచికి అనుగుణంగా తమ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తుందని ప్రకటించారు. అమెరికాలో ఉన్న వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణలో ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనేది తమ సంకల్పమని అన్నారు. తెలంగాణ అంటేనే వ్యాపారం.. తెలంగాణ అంటేనే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తామని చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను ఈ సందర్భంగా సీఎం వివరించారు. త్వరలోనే హైదరాబాద్లో నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని చెప్పారు. ఇది భారత దేశపు భవిష్యత్తుకు చిరునామాగా నిలుస్తుందని అభిప్రాయ పడ్డారు. దేశంలోనే జీరో కార్బన్ సిటీ ఇక్కడ ఏర్పడతుందని అన్నారు. ఫ్యూచర్ సిటీలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్తో పాటు, మెడికల్, టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్‌వేర్, ఫార్మా విలేజ్లను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ఫ్యూచర్ సిటీ రాష్ట్ర అభివృద్దితో పాటు పరిశ్రమలకు సిరుల పంట పండిస్తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణను సులభతరం చేస్తామని సీఎం ప్రకటించారు. అటువంటి సరికొత్త ఆలోచనలతోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. సోమవారం న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వర్కింగ్ లంచ్ అనంతరం ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో రౌండ్‌టేబుల్‌ సమావేశమయ్యారు. ఫార్మా, ఐటీ, టెక్నాలజీ, ఈవీ, బయోటెక్, షిప్పింగ్ రంగాల్లో పేరొందిన కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నఛైర్‌పర్సన్‌లు, సీఈవోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామిక క్లస్టర్లుగా విభజించి, అభివృద్ధి చేసేందుకు రూపొందించిన భవిష్యత్తు ప్రణాళికలు, తెలంగాణ చరిత్రపై ముఖ్యమంత్రి ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తన మనసులోని మాటలతో పాటు తమ ప్రభుత్వం ఏం కోరుకుంటుందో.. తన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలేమిటో వెల్లడిస్తానంటూ అందరినీ ఉత్సాహపరిచారు. ముఖ్యమంత్రి హోదాలో ఇది తన మొదటి అమెరికా పర్యటన అని.. ఇక్కడి నుంచి వీలైనన్ని పెట్టుబడులు తెలంగాణకు తీసుకెళ్లాలలన్నదే తన లక్ష్యమని ప్రకటించారు. పెట్టుబడుల గమ్యస్థానంగా దేశంలోనే అందరినీ ఆకర్షిస్తున్న తెలంగాణకు ఉన్న అనుకూలతలన్నింటినీ ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్, లైఫ్-సైన్స్, ఫార్మా రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలలో బలమైన పునాదులు వేసుకుందని చెప్పారు. కోవిడ్ను అధిగమించేందుకు మిలియన్ల కొద్దీ వ్యాక్సిన్‌లను తయారు చేసి ప్రపంచానికి సాయం చేసిందని అన్నారు. తెలంగాణలో అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని, అద్భుతమైన ప్రతిభ సంపద సిద్ధంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చే పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమమైన మద్దతును అందిస్తుందని ప్రకటించారు. నిజాంలు నిర్మించిన 425 సంవత్సరాల పురాతనమైన హైదరాబాద్, ఇంచుమించుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో సమకాలీనంగా ఉండటం ఆసక్తి రేపుతోందని అన్నారు. అభిరుచితో పాటు అద్భుతమైన దూరదృష్టితో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ప్రపంచ పారిశ్రామికవేత్తలందరూ ఒకసారి తెలంగాణకు రావాలని, హైదరాబాద్ నగరాన్ని సందర్శించాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. హైదరాబాద్లో ఉన్న అనుకూలతలతో పాటు అక్కడున్న అవకాశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కలిసికట్టుగా గొప్ప భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణను చైనాకు ప్రత్యామ్నాయ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి దార్శనికతను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలకు వివరించారు. ప్రపంచంలోనే టాప్ టెన్ సిటీల్లో ఒకటిగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామని, ఆ దిశగా రూపొందించిన భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించారు. ఈ సమావేశం తెలంగాణలో కొత్త పెట్టుబడులకు మరింత ఊతమిస్తుందనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. కార్నింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాల్డ్ వెర్క్లీరెన్, కేకేఆర్ పార్టనర్ దినేష్ పలివాల్, సిగ్నా ఇంటర్నేషనల్ పబ్లిక్ పాలసీ హెడ్ ఎక్రమ్ సర్పర్, న్యూజెర్సీ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ బిల్ నూనన్, సేఫ్‌సీ గ్రూప్ ఛైర్మన్ ఎస్వీ అంచన్, టిల్మాన్ హోల్డింగ్స్ ఛైర్మన్ సంజీవ్ అహుజా, అమ్నీల్ ఫార్మా కో సీఈవో చింటూ పటేల్, జేపీ మోర్గాన్ చేజ్ ఈడీ రవి లోచన్ పోలా, ఆక్వాటెక్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్) సుబ్బారావు, యాక్సెంచర్ ఎండీ అమిత్కుమార్, డెలాయిట్ ఎండీ పునిత్ లోచన్, హాబిట్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వీర బుద్ధి, బీఎన్వై మెల్లన్ ఎండీ అట్లూరి, పేస్ యూనివర్సిటీ డీన్ డా. జోనాథన్ హిల్, అకుజెన్ చీఫ్ సైంటిఫిక్ హెడ్ అరుణ్ ఉపాధ్యాయ, ఎస్ అండ్ పీ గ్లోబల్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ స్వామి కొచ్చెర్లకోట, ఇంటర్కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్ ఎండీ అశ్విని పన్సే ఈ సమావేశంలో పాల్గొన్నారు.

54 total views, no views today

హైదరాబాద్‌లో ఆర్సీజియం (Arcesium) విస్తరణకు ఒప్పందం

*హైదరాబాద్‌లో ఆర్సీజియం (Arcesium) విస్తరణకు ఒప్పందం*తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మరో కంపెనీతో అవగాహన కుదుర్చుకుంది. అసెట్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ సర్వీసెస్, అడ్వాన్స్‌డ్ డేటా ఆపరేషన్స్‌లో ప్రముఖ కంపెనీ ఆర్సీజియం (Arcesium) హైదరాబాద్‌లోని తమ కంపెనీని విస్తరించడానికి అంగీకరించింది.ఆర్సీజియం (Arcesium) సీఈఓ గౌరవ్ సూరి గారు, ఇతర ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, రాష్ట్ర అధికారుల బృందం జరిపిన చర్చల్లో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఆర్సీజియం (Arcesium) అంతర్జాతీయంగా బయటి దేశాల్లో మొదటి శాఖను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేసింది. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అందిస్తున్న సహకారంతో తమ సేవలను మరింతగా విస్తరిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో కావలసిన సదుపాయాలకు అనుగుణంగా హైదరాబాద్‌లోని గొప్ప టాలెంట్ ఫోర్స్, సహజ రీతిలో ఉండే లొకేషన్, నైపుణ్యం కలిగిన స్థానిక ఉద్యోగుల లభ్యత కారణంగా అంకితభావంతో హైదరాబాద్‌లో డాటా సొల్యూషన్ సర్వీసులను అభివృద్ధి పరుస్తున్నామని గౌరవ్ సూరి తెలిపారు.వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించుకోనుంది. డీఈ షా గ్రూప్ (DE Shaw group), బ్లాక్‌స్టోన్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ Blackstone Alternative Asset Management (BAAM) మద్దతుతో ఆర్సీజియం (Arcesium) స్వతంత్ర సంస్థగా ప్రారంభమైంది.ఆర్సీజియం (Arcesium) తన సేవలను విస్తరణ చేపడుతున్నందుకు ముఖ్యమంత్రి కంపెనీ ప్రతినిధులను అభినందించారు. కంపెనీకి తమ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణలో ఐటీ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.

57 total views, no views today

హైదరాబాద్‌లో ట్రైజిన్ (Trigyn) ఏఐ ఇన్నోవేషన్ సెంటర్

*హైదరాబాద్‌లో ట్రైజిన్ (Trigyn) ఏఐ ఇన్నోవేషన్ సెంటర్**-ఆరు నెలల్లో కార్యకలాపాల ప్రారంభం.. వెయ్యి మందికిపైగా ఉద్యోగాలు, శిక్షణ*ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ (Trigyn Technologies Limited) హైదరాబాద్ లో తమ అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గారు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి నేతృత్వంలోని అధికారుల బృందంతో Trigyn కంపెనీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సెంటర్ పై ఈ సందర్భంగా చర్చలు జరిపారు. Trigyn కంపెనీ డేటా అనలిటిక్స్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ అందిస్తుంది. హైదరాబాద్ లో ట్రైజిన్ (Trigyn) కంపెనీ అర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రాబోయే మూడేండ్లలో 1,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకొని శిక్షణను అందిస్తుంది. Trigyn కంపెనీ మొత్తం ఆదాయం 160 మిలియన్ డాలర్లకు పైగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీలో పని చేస్తున్న 2,500 మందిలో వెయ్యి మంది మన దేశంలో ఉండగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు వంద మంది ఉన్నారు. మరో ఆరు నెలల్లోనే తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ఈ కంపెనీ ప్రకటించింది. రెండు దశాబ్దాలకు పైగా ఐక్య రాజ్య సమితితో పాటు అనుబంధ విభాగాలకు Trigyn కంపెనీ సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. గత ఏడాది నుంచి ట్రైజిన్ కంపెనీ తమ సేవలను అందుకుంటున్న సంస్థల్లో అర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ వినియోగంతో పాటు ఫలితాలపై విశ్లేషణలు చేస్తోంది. అన్ని రంగాలలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ఎంచుకుంది.

87 total views, 3 views today

వాల్ష్ కర్రా హోల్డింగ్స్ (WKH) సంస్థ వీ-హబ్ [WE HUB – Women Entrepreneurs Hub]లో 5మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది

తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద ప్రోత్సాహకంగా, అమెరికాకు చెందిన ప్రముఖ వాల్ష్ కర్రా హోల్డింగ్స్ (WKH) సంస్థ తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వీ-హబ్ [WE HUB – Women Entrepreneurs Hub]లో 5మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి సమక్షంలో వాల్ష్ కర్రా హోల్డింగ్స్ సంస్థ ప్రతినిధులు – వీ హబ్ సీఈవో సీతా పల్లచోళ్ల ఒప్పందాలపై సంతకాలు చేశారు. రాబోయే ఐదేండ్లలో 100 మిలియన్ డాలర్ల (రూ.839 కోట్ల) పెట్టుబడులను తెలంగాణ కేంద్రంగా పురుడుపోసుకుంటోన్న స్టార్టప్ కంపెనీల్లో పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వాల్ష్ కర్రా హోల్డింగ్స్ సహ వ్యవస్థాపకులు ఫణి కర్రా, గ్రేగ్ వాల్ష్ ముఖ్యమంత్రి బృందానికి వివరించారు.

54 total views, no views today

హైదరాబాద్ సమగ్ర, సమ్మిళిత అభివృద్ధిని నిర్దేశించే మాస్టర్ ప్లాన్ ఏడాదిలోపు అందుబాటులోకి

రాజధాని హైదరాబాద్ సహా తెలంగాణ సమగ్ర, సమ్మిళిత అభివృద్ధిని నిర్దేశించే మాస్టర్ ప్లాన్ మరో ఏడాదిలోపు అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. క్రెడాయి హైదరాబాద్ ఆధ్వర్యంలో “రీ-ఇమాజినింగ్ హైదరాబాద్” కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.

భవిష్యత్ తరాలనూ దృష్టిలో ఉంచుకొని, రేపటి అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ 4.0 అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. నాలుగో మహా నగర నిర్మాణంలో భాగంగా ఆ ప్రణాళికల్లో కొన్ని పనులను కూడా చేపట్టామని తెలిపారు.

తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన బ్యాగరికంచె ప్రాంతం రాబోయే రోజుల్లో సంపదలో బంజారాహిల్స్‌ను మించిపోతుందని చెప్పారు.

పాలకులుగా ఎవరున్నా ఈ చారిత్రక నగర అభివృద్ధికి తీసుకున్న విధానాలు కొనసాగాయి కాబట్టే హైదరాబాద్ నగరానికి ప్రపంచం స్థాయిలో ఒక గుర్తింపు వచ్చిందన్నారు.

మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్‌తో కలుషితం లేని నీటి ప్రవాహాన్ని చూడబోతున్నామని, తద్వారా హైదరాబాద్ బ్రాండ్ వ్యాల్యూ మరింత పెరిగి నగరం చుట్టుపక్కల్లో పెట్టుబడులు వెల్లువలా వస్తాయని ముఖ్యమంత్రి అన్నారు.

కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, క్రెడాయి ప్రతినిధులు పాల్గొన్నారు.

102 total views, no views today

కోకాపేట్ నియోపోలిస్ వరకు మెట్రో రైలు విస్తరణ

hyderabad-metro-rail-station, metro rail, 1 st phase Hyderabad metro rail, Miyapur to Nagole metro rail,
hyderabad-metro-rail-station

హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణతో నగరం మరింత అభివృద్ధి చెందుతోంది. శివార్లలో ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్రాథమిక మౌలిక సదుపాయాలతో, నగరం మరింత విస్తరించడానికి సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మెట్రో రెండో దశలో దూరం మరియు అంచనా వ్యయాన్ని గణనీయంగా పెంచాలని ప్రతిపాదించింది. గతంలో ఐదు కారిడార్లలో 70 కిలోమీటర్లు కవర్ చేయగా, ఇప్పుడు అది 8.4 కిలోమీటర్లు పెరిగి మొత్తం 78.4 కిలోమీటర్లకు చేరుకుంది. దీంతో మొత్తం మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.24,042 కోట్లకు చేరింది.

హైటెక్ సిటీ సమీపంలోని రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుండి విప్రో సర్కిల్ మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అమెరికన్ కాన్సులేట్ వరకు ఎనిమిది కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదనలో చేర్చారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టును కోకాపేటలోని నియోపోలిస్ వరకు పొడిగించాలని నిర్ణయించింది. ఈ పొడిగింపు మెట్రో మార్గానికి సుమారు 3.3 కిలోమీటర్లు జోడిస్తుంది. అదనంగా, మెట్రో రైలు డిపో నిర్మాణానికి ప్రభుత్వం కోకాపేటలో భూమిని సర్వే చేస్తోంది.

మరో రూట్‌లో నాగోల్, ఎల్‌బీ నగర్, చాంద్రాయణగుట్ట, మల్కాజిగిరి సర్కిల్ నుంచి జాలపల్లి మీదుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 29 కిలోమీటర్ల మేర ఎయిర్‌పోర్ట్ మెట్రోను ప్రాథమికంగా అంచనా వేశారు. మల్కాజ్‌గిరి నుంచి ఆరామ్‌ఘర్‌, కొత్త హైకోర్టు వరకు 5 కిలోమీటర్ల పొడిగింపును బడ్జెట్‌లో ప్రతిపాదించారు. మియాపూర్-పటాన్‌చెరు, ఎల్‌బీనగర్-హైదరాబాద్‌, ఫలక్‌నుమా-చాంద్రాయణగుట్ట కారిడార్లలో ఎలాంటి మార్పులు లేవని బడ్జెట్‌లో స్పష్టం చేశారు.

మెట్రో రైలు ప్రాజెక్టు కోకాపేట వరకు విస్తరించడంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉండటంతో కోకాపేట మరియు దాని పరిసర ప్రాంతాలు ఇప్పటికే ఊహించిన దానికంటే ఎక్కువగా అభివృద్ధి చెందాయి. ఇప్పుడు మెట్రో రైలుతో శంకరపల్లి, చేవెళ్ల వరకు రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దూరం కాస్త ఎక్కువైనా, అద్భుతమైన రవాణా సౌకర్యాలు ఇళ్లు కొనుగోలు చేసేందుకు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలకు ఆసక్తిని కలిగిస్తాయని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.

105 total views, no views today