వివింట్ ఫార్మా రూ. 400 కోట్ల పెట్టుబడితో జీనోమ్ వ్యాలీలో ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రం ఏర్పాటుకు సంసిద్ధత

వివింట్ ఫార్మా (Vivint Pharma) రూ. 400 కోట్ల పెట్టుబడి

తెలంగాణ జీనోమ్ వ్యాలీలో ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రం ఏర్పాటుకు సంసిద్ధత

తెలంగాణలో పెట్టుబడులకు పేరొందిన కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి బృందం వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపుతోంది.హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వివింట్ ఫార్మా (Vivint Pharma) కంపెనీ ముందుకొచ్చింది. రూ.400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోయే ఈ కంపెనీ దాదాపు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం వివింట్ (Vivint Pharma) కంపెనీ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల అనంతరం పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలో వివింట్ (Vivint Pharma) కంపెనీ ఆర్ అండ్ డీ కేంద్రం ఉంది. సుమారు రూ. 70 కోట్లతో నెలకొల్పిన ఈ సదుపాయాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో విస్తరించేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా హైదరాబాద్ లో తన మొదటి తయారీ కర్మాగారాన్ని స్థాపించనుంది. జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులకు వివింట్ ఫార్మా (Vivint Pharma) ముందుకు రావటంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. తెలంగాణలో అన్ని పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని, జీనోమ్ వ్యాలీ ఔషద కంపెనీలను తప్పకుండా ఆకర్షిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

72 total views, 3 views today

కార్నింగ్ ఇన్‌కార్పొరేటేడ్ కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధి

మెటీరియల్‌ సైన్స్‌ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన “కార్నింగ్ ఇన్‌కార్పొరేటేడ్” (Corning Incorporated) కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకు వచ్చింది. నైపుణ్యాలతో పాటు పరిశ్రమల్లో నూతన సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గారు, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు గారు ఎమర్జింగ్ ఇన్నొవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాల్డ్‌ వెర్క్లీరెన్ అధ్వర్యంలోని కార్నింగ్ (Corning) ప్రతినిధుల బృందంతో చర్చల అనంతరం అవగాహన ఒప్పంద పత్రాలపై అధికారికంగా సంతకాలు చేశారు. ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాలలో అత్యాధునిక పరిశోధన, అభివృద్ది కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంతో కార్నింగ్‌ (Corning) భాగస్వామిగా పనిచేస్తుంది. తెలంగాణలో ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం నెలకొల్పటంపై చర్చలు జరిపారు. 2025 నుంచి ఇందులో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమిస్తామని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH) సహకారంతో డాక్టర్ రెడ్డీస్ లిమిటెడ్, లారస్ ఫార్మా లిమిటెడ్ నిర్వహిస్తున్న ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ (ఎఫ్‌సిటి) హబ్‌లోనూ కార్నింగ్ కంపెనీ భాగస్వామ్యం పంచుకుంటుంది. ఫార్మాస్యూటికల్ మరియు కెమికల్ పరిశ్రమలలో ఆవిష్కరణలతో పాటు ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీలో Corning కంపెనీ తగిన సహకారం అందిస్తుంది. కొత్తగా అందుబాటులోకి తెస్తున్న అడ్వాన్స్డ్ ఫ్లో రియాక్టర్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కార్నింగ్ (Corning) కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి వివరించారు. ఈ అత్యాధునిక గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఫార్మా రంగం అభివృద్ధికి దోహదపడుతుంది. ఔషధాల ప్యాకేజింగ్ పరిశ్రమలో ఈ గ్లాస్ ట్యూబ్‌లను ఉపయోగిస్తారు. వీటి తయారీకి వినూత్నమైన వెలాసిటీ గ్లాస్-కోటింగ్ టెక్నాలజీని ఈ కంపెనీ వినియోగిస్తోంది. ఈ కొత్త సదుపాయంతో తెలంగాణలో ఇప్పటికే వేగంగా విస్తరిస్తున్న ఫార్మాస్యూటికల్ రంగంలో ఉత్పాదకత సామర్థ్యం మరింత మెరుగుపడుతుందనే అంచనాలున్నాయి.

72 total views, no views today