హైదరాబాద్‌లో నగరవాసులకు ట్రాఫిక్ నుండి కాస్త ఊరట లభించినట్లే. అమీర్‌పేట, ఎల్బీ నగర్ మధ్య ప్రయాణించే వారికి ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న మెట్రో కల నిజమయింది. అమీర్‌పేట నుండి ఎల్బీ నగర్ వరకు మెట్రో రైలు ప్రయాణం ప్రారంభం అయింది. గవర్నర్ నరసింహన్ అమీర్ పేట మెట్రో స్టేషన్లో జెండా ఊపి మెట్రో రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్ తదితరులు అమీర్‌పేట నుండి ఎల్బీ నగర్ వరకు మెట్రో రైలు ప్రయానించారు.
ఎల్బీనగర్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మెట్రో రైలు సేవలను వినియోగించుకోవడం ద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని, తద్వారా కాలుష్యాన్ని సైతం నియంత్రించవచ్చన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అందరికీ సౌకర్యంగా ఉండేలా ప్రతి మెట్రో స్టేషన్‌ను తీర్చిదిద్దామని, వీటి నిర్మాణంలో అన్ని నాణ్యతా ప్రమాణాలు పాటించామన్నారు.
ఈ రూట్లో మొత్తం 17 స్టేషన్లుండగా.. నాలుగు మినహా మిగతాచోట్ల ఇప్పటివరకు పార్కింగ్ వసతులు అందుబాటులో లేవు. మెట్రో స్టేషన్ పార్కింగ్ వసతి లేని చోట స్టేషన్ కు కొద్ది దూరంలో ఫ్రీ పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేయడమైనది.
ఈ మార్గం ప్రారంభంతో ఎల్బీనగర్ నుంచి బయలుదేరిన వ్యక్తి 29 కిలో మీటర్ల మియాపూర్ కు 52 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రారంభంలో ప్రతి ఐదు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైళ్లు 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి.
హైదరాబాద్ మెట్రో కారిడార్ 1 మియాపూర్ నుండి ఎల్బీ నగర్ వరకు మొత్తం 27 కిలోమీటర్లు. ఇందులో మియాపూర్ నుండి అమీర్‌పేట వరకు మొదటి దశలో ప్రారంభించారు. ఇంకా కారిడార్ ౩ నాగోల్ నుండి రాయదర్గ వరకు మొత్తం 29 కిలోమీటర్లు ఇందులో నాగోల్ నుండి అమీర్ పేట వరకు మొదటి దశలో ప్రారంభించారు. రెండో దశగా కారిడార్ 1లో అమీర్ పేట నుండి ఎల్బీనగర్ వరకు ఇప్పుడు ప్రారంభించారు. మొత్తానికి కారిడార్ 1 మొత్తం పూర్తయింది. కారిడార్ ౩ లో అమీర్‌పేట నుండి హైటెక్ సిటి వరకు ఈ ఏడాది నవంబర్ లో పూర్తీ కావచ్చని అధికారులు చెపుతున్నారు.
7,445 total views, no views today