* హైదరాబాద్ లో ఉప్పల్, నాగోల్, సనత్‌నగర్, మేడ్చల్, కొంపల్లి ప్రాంతాలకు ఐటీ పరిశ్రమల విస్తరణ
*నగరంలో నూతన ఐటీ క్లస్టర్లకు అనుగుణంగా వసతుల కల్పన
*స్వల్పకాలిక లక్ష్యాలతో కార్యాచరణ
*అవసరమైన చోట మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్లు
హైటెక్ సిటి, గచ్చిబౌలి లు ఐటీ కంపనీలకు అడ్డలుగా ఉన్నాయి. ఇప్పుడు ఐటీ కంపనీలను నగరం నలుదిశలా విస్తరించి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత నగరంలో ఐటీ పరిశ్రమ జాతీయసగటు కన్నా ఎక్కువగా వృద్ధిని నమోదు చేసుకుంటున్నదన్న మంత్రి కేటీఆర్, త్వరలోనే ఐటీ ఎగుమతుల విలువ రూ.లక్ష కోట్లకు చేరుకుంటుందని చెప్పారు. ఈ మేరకు పెరుగుతున్న ఐటీ పరిశ్రమకు అనుగుణంగా నగరంలో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసు, ట్రాఫిక్, విద్యుత్, రోడ్లు-భవనాల శాఖ, జీహెచ్‌ఎంసీ, మెట్రోరైలు, హెచ్‌ఎండీఏ తరఫున చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సమీక్షించారు.
ప్రస్తుతం ఉన్న ఐటీ క్లస్టర్లకు తోడుగా ఉప్పల్, నాగోల్, సనత్‌నగర్, మేడ్చల్, కొంపల్లివంటి ప్రాంతాలకు ఐటీ పరిశ్రమల విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యూహాలపై మంత్రి సమీక్షించారు. ముఖ్యంగా ప్రస్తుతం ఐటీ పరిశ్రమ ఉన్న గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై స్వల్పకాలిక లక్ష్యాలతో చేపట్టాల్సిన చర్యలపైన ప్రణాళికలు రూపొందించాలని టీఎస్‌ఐఐసీ అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతోపాటుగా నూతనంగా ఏర్పాటుకానున్న మరో ఐటీ క్లస్టర్ రాజేంద్రనగర్, బుద్వేల్‌లోనూ ఇప్పటి నుంచే అన్ని వసతులు ఉండేలా చూడాలని కోరారు. నూతనంగా ఏర్పాటు కాబోయే క్లస్టర్లతోపాటు ఇప్పటికే ఉన్న క్లస్టర్లలోనూ రోడ్ల విస్తరణ, మురుగునీటి కాల్వల నిర్మాణం, విద్యుత్, నీటిసరఫరా అంశాలపై పూర్తిస్థాయి కార్యాచరణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఐటీ రంగంలో ఐదేండ్లలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ విధానాల ఫలితంగా అనేక ఐటీ సంస్థలు నగరంలో నూతనంగా కార్యకలాపాలు చేపట్టేందుకు, ప్రస్తుతం ఉన్నవాటిని విస్తరించేందుకు ముందుకు వస్తున్నాయి . రానున్న ఐదేండ్లలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఐటీ రంగంలో రానున్నాయని తెలిపారు. అయితే ఈ పెరుగుదల ఒకేవైపు కాకుండా నగరంలోని నలుమూలలా వస్తే భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తవని, సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ పెరుగుదలలో భాగంగా అవసరమైన పోలీస్ స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాలు, అవకాశం ఉన్న చోట మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్లు వంటివి ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమావేశంలో టీఎస్‌ఐఐసీ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, ముగ్గురు పోలీసు కమిషనర్లు, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
12,407 total views, no views today