గతంలో ౩౦౦ అడుగుల వెడల్పుతో 338 కిలోమీటర్ల మేర రీజినల్ రింగురోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాని ఆ ౩౦౦ అడుగుల వెడల్పు ఉన్న రోడ్డు భవిష్యత్తులో పెరగబోయే ట్రాఫిక్ ను తట్టుకునే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో 500 అడుగుల వెడల్పుతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ రీజినల్ రింగురోడ్డును సాధారణ రహదారిగా కాకుండా ప్రపంచస్థాయి ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించాలని అధికారులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఆ దిశగా డీపీఆర్ తయారుచేయాలని, దీనికి నిధుల మంజూరు కోసం కేంద్రంతో మాట్లాడుతానని చెప్పారు. సీఎం గురువారం ప్రగతిభవన్‌లో సీఎస్ ఎస్కే జోషి, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ గణపతిరెడ్డి ఇతర అధికారులతో సమావేశమై రీజినల్ రింగురోడ్డుపై చర్చించారు. రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కూడా సీఎం ఫోన్‌లో మాట్లాడారు. హైదరాబాద్ నగరం దేశంలోనే గొప్ప కాస్మోపాలిటన్ నగరం. ఇక్కడి వాతావరణ అనుకూలత , సామరస్య జీవన విధానం కారణంగా ఈ నగరం ఇంకా అభివృద్ది చెందుతుంది. దేశం నలుమూలల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు పెరుగుతాయి. ఇప్పుడున్న ఔటర్ రింగురోడ్డు భవిష్యత్ అవసరాలను తీర్చలేదు. కాబట్టి హైదరాబాద్ చుట్టూ మరో రింగురోడ్డును రీజినల్ రింగురోడ్డు పేరుతో (RRR-Regional Ring Road) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సంగారెడ్డి- గజ్వేల్- చౌటుప్పల్- మాల్- కడ్తాల్- షాద్‌నగర్- చేవెళ్ల- కంది పట్టణాలను కలుపుతూ 338 కిలోమీటర్ల మేర 500 అడుగుల వెడల్పుతో ఈ రహదారి నిర్మాణం జరుగాలి. ముంబై- పుణె, అహ్మదాబాద్- వడోదర మధ్య ప్రస్తుతమున్న ఎక్స్‌ప్రెస్‌వేల కంటే మన రీజినల్ రింగురోడ్డు గొప్పగా ఉండాలి. విజయవాడ, ముంబై, బెంగళూరు, నాగపూర్ నగరాలకు వెళ్లే మార్గంలో జంక్షన్లను బాగా అభివృద్ధి చేయాలి. ఆ నాలుగు జంక్షన్ల్ల వద్ద ప్రభుత్వం 300 ఎకరాల నుంచి 500 ఎకరాల వరకు సేకరిస్తుంది. ఆ స్థలంలో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి. అక్కడ పార్కింగ్, ఫుడ్‌కోర్టులు, రెస్ట్‌రూంలు, పార్కులు, పిల్లల ప్లే ఏరియా, షాపింగ్ మాల్స్, మంచినీరు, టాయిలెట్లు.. ఇలా అన్ని రకాల వసతులుండాలి. దేశంలోనే ఈ రహదారి అతిగొప్ప రహదారిగా ఉండాలి. ఇందుకోసం మంచి రహదారులు, రహదారుల పక్కన సకల సౌకర్యాలు కలిగిన దేశాల్లో పర్యటించి అధ్యయనం చేయాలి అని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు.
14,507 total views, no views today