తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యంపై ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో ముఖ్యమంత్రి బృందం భేటీ

ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో ముఖ్యమంత్రి బృందం భేటీ

తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యంపై సంప్రదింపులు

స్కిల్ డెవెలప్మెంట్, నెట్ జీరో, ఫ్యూచర్ సిటీ, సిటిజన్ హెల్త్ ప్రాజెక్టులపై ఆసక్తి

తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు ప్రపంచ బ్యాంక్ సంసిద్ధతను వ్యక్తం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు కలిసికట్టుగా రోడ్ మ్యాప్ను రూపొందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ప్రధానంగా స్కిల్ డెవెలప్మెంట్, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, నెట్ జీరో సిటీ, ఆరోగ్య సంరక్షణ, డయాగ్నస్టిక్స్, హెల్త్ ప్రొఫైల్ రంగాల్లో భాగస్వామ్యానికి అవసరమైన సంప్రదింపులు జరిగాయి.ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ఉన్నతాధికారులు శేషాద్రి, విష్ణు వర్ధన్ రెడ్డి, అజిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణం, జీవనోపాధి, నైపుణ్యాల వృద్ధి, ఉద్యోగాలు, ఆర్థిక సుస్థిరత తో పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల తమ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలన్నీఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తాము చేపట్టబోయే ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికన అమలు చేసి తీరుతామని ప్రకటించారు. అన్నింటిలోనూ అత్యంత పారదర్శకతను పాటిస్తామని స్పష్టం చేశారు. ప్రాంతాల వారీగా చేపట్టే ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, వాటి అమలును వేగవంతం చేసేందుకు వివిధ విభాగాలకు చెందిన నిపుణుల బృందం ఏర్పాటు చేయాలనే ఆలోచనలను ప్రపంచబ్యాంకు బృందంతో పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ అభివృద్ధికి ముఖ్యమంత్రి అనుసరిస్తున్న సమతుల్య దృక్పథం మంచి ఫలితాలను అందిస్తుందని ప్రపంచ బ్యాంకు బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. గతంలో భారత్ లో తమ భాగస్వామ్యంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు సానుకూల ఫలితాలు అందించాయని గుర్తు చేసింది. చర్చల సందర్భంగా నెట్ జీరో సిటీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చూపిన చొరవపై ప్రపంచ బ్యాంకు బృందం మరింత ఆసక్తిని ప్రదర్శించింది. ప్రజా పాలనతో పాటు రాష్ట్రంలో సమగ్ర సమతుల్య అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును చర్చల్లో పాలుపంచుకున్న ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్ ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం ప్రపంచ బ్యాంకు లాంటి అంతర్జాతీయ ద్రవ్యసంస్థలతో కలిసి పని చేయాలని నిశ్చయించటం ఇదే మొదటి సారి. తెలంగాణలో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, స్కిల్ యూనివర్శిటీ, సిటిజన్ హెల్త్‌కేర్, హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కీలకమైన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి అనుసరిస్తున్న భవిష్యత్తు వ్యూహాలకు ప్రపంచ బ్యాంకు మద్దతు మరింత ఊతమివ్వనుంది.

321 total views, no views today

హైదరాబాద్ లో కొత్త ఐటీ క్లస్టర్లు

hyderabad updates, hyderabad it industry, it expansion, ktr meeting with officials
హైదరాబాద్ లో కొత్త ఐ టి క్లస్టర్ల ఏర్పాటు మౌలికసదుపాయాల కల్పన గురించి అధికారులతో మంత్రి కేటిఆర్ సమావేశం

* హైదరాబాద్ లో ఉప్పల్, నాగోల్, సనత్‌నగర్, మేడ్చల్, కొంపల్లి ప్రాంతాలకు ఐటీ పరిశ్రమల విస్తరణ

*నగరంలో నూతన ఐటీ క్లస్టర్లకు అనుగుణంగా వసతుల కల్పన

*స్వల్పకాలిక లక్ష్యాలతో కార్యాచరణ

*అవసరమైన  చోట మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్లు

హైటెక్ సిటి, గచ్చిబౌలి లు  ఐటీ కంపనీలకు అడ్డలుగా ఉన్నాయి. ఇప్పుడు ఐటీ కంపనీలను నగరం నలుదిశలా విస్తరించి కావలసిన మౌలిక సదుపాయాలు  కల్పిస్తామన్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత నగరంలో ఐటీ పరిశ్రమ జాతీయసగటు కన్నా ఎక్కువగా వృద్ధిని నమోదు చేసుకుంటున్నదన్న మంత్రి కేటీఆర్, త్వరలోనే ఐటీ ఎగుమతుల విలువ రూ.లక్ష కోట్లకు చేరుకుంటుందని చెప్పారు. ఈ మేరకు పెరుగుతున్న ఐటీ పరిశ్రమకు అనుగుణంగా నగరంలో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసు, ట్రాఫిక్, విద్యుత్, రోడ్లు-భవనాల శాఖ, జీహెచ్‌ఎంసీ, మెట్రోరైలు, హెచ్‌ఎండీఏ తరఫున చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సమీక్షించారు. 

ప్రస్తుతం ఉన్న ఐటీ క్లస్టర్లకు తోడుగా ఉప్పల్, నాగోల్, సనత్‌నగర్, మేడ్చల్, కొంపల్లివంటి ప్రాంతాలకు ఐటీ పరిశ్రమల విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యూహాలపై మంత్రి సమీక్షించారు. ముఖ్యంగా ప్రస్తుతం ఐటీ పరిశ్రమ ఉన్న గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై స్వల్పకాలిక లక్ష్యాలతో చేపట్టాల్సిన చర్యలపైన ప్రణాళికలు రూపొందించాలని టీఎస్‌ఐఐసీ అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతోపాటుగా నూతనంగా ఏర్పాటుకానున్న మరో ఐటీ క్లస్టర్ రాజేంద్రనగర్, బుద్వేల్‌లోనూ ఇప్పటి నుంచే అన్ని వసతులు ఉండేలా చూడాలని కోరారు. నూతనంగా ఏర్పాటు కాబోయే క్లస్టర్లతోపాటు ఇప్పటికే ఉన్న క్లస్టర్లలోనూ రోడ్ల విస్తరణ, మురుగునీటి కాల్వల నిర్మాణం, విద్యుత్, నీటిసరఫరా అంశాలపై పూర్తిస్థాయి కార్యాచరణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఐటీ రంగంలో ఐదేండ్లలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వ విధానాల ఫలితంగా అనేక ఐటీ సంస్థలు నగరంలో నూతనంగా కార్యకలాపాలు చేపట్టేందుకు, ప్రస్తుతం ఉన్నవాటిని విస్తరించేందుకు ముందుకు వస్తున్నాయి  . రానున్న ఐదేండ్లలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఐటీ రంగంలో రానున్నాయని తెలిపారు. అయితే ఈ పెరుగుదల ఒకేవైపు కాకుండా నగరంలోని నలుమూలలా వస్తే భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తవని, సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ పెరుగుదలలో భాగంగా అవసరమైన పోలీస్ స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాలు, అవకాశం ఉన్న చోట మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్లు వంటివి ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమావేశంలో టీఎస్‌ఐఐసీ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, ముగ్గురు పోలీసు కమిషనర్లు, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

12,530 total views, no views today