- ఎల్ఆర్ఎస్ ప్రక్రియకు మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం
- ఈ వారం నుంచి దరఖాస్తుల పరిశీలన ప్రారంభం
- ప్లాట్లకు మూడు దశల్లో, లేఔట్లకు నాలుగు దశల్లో పరిశీలన
రాష్ట్రంలో అక్రమ లేఅవుట్లు ప్లాట్లు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూడు నెలల్లో దరఖాస్తులను పరిశీలించి అర్హమైన వాటిని క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఆగస్టు మొదటి వారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి ఎం దానకిషోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాట్ల దరఖాస్తులను మూడు దశల్లో లేఅవుట్ల దరఖాస్తులను నాలుగు దశల్లో పరిశీలించాలని నిబంధనలో పేర్కొన్నారు. అనంతరం వాటిలో అర్హమైన వాటిని నిర్ధారిత ఫీజులు వసూలు చేసి క్రమబద్ధీకరిస్తారు.
25 లక్షల దరఖాస్తులు
స్థలాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 2020లో సుమారు 25 లక్షల మంది దరఖాస్తు చేశారు కోర్ట్ లో కేసులు ఉండడంతో అవి పరిష్కారానికి నోచుకోలేదు. ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి మాత్రం కోర్టు తీర్పునకు లోబడి ఉంటామంటూ అఫిడవిట్ తీసుకొని అధికారులు అనుమతులు ఇస్తున్నారు. గత డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన నాటినుండి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉత్తర్వుల జారీ తో దరఖాస్తుదారులను హర్షం వ్యక్తం అవుతుంది.
ముందుగా సిజిజి పరిశీలన
ఆ దరఖాస్తులను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ముందుగా పరిశీలిస్తుంది. వివిధ నిబంధనల ఆధారంగా కంప్యూటర్ ద్వారా వడపోస్తుంది. ఆయా ఆస్తులు నిషేధిత జాబితాలో ఉంటే గుర్తించి దరఖాస్తుదారులకు సమాచారం పంపుతుంది. దరఖాస్తుదారులు అవసరమైన పూర్తిస్థాయి పత్రాలు ఇవ్వకుంటే దానిపైన సమాచారాన్ని పంపుతుంది.
సి జి జి వడపోత తరువాత మిగిలిన దరఖాస్తులను రెవెన్యూ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, పంచాయతీ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంది. నాళాలు, చెరువులు, వారసత్వ సంపద, శిఖం, దేవాదాయ, ఇనాం భూములు తదితర కోణాల్లో పరిశీలించి అభ్యంతరాలను నమోదు చేస్తారు. ఆయా వివరాలను ఇప్పటికే సిజిజి రూపొందించిన సెల్ ఫోన్ యాప్ లలో నమోదు చేస్తారు
రెండో దశలో
మరింత అధ్యయనం చేసి అర్హమైన నిర్ధారిత ఫీజు చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేస్తారు. క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హమైనవి కాదని గుర్తిస్తే ఆ దరఖాస్తులను తిరస్కరిస్తారు. ఆ సమాచారాన్ని దరఖాస్తుదారులకు పంపుతారు.
మూడో దశలో
అర్హమైన దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించినట్లు నిర్ధారించాక క్రమబద్ధీకరణ ఉత్తర్వులను జారీ చేస్తారు.
లే అవుట్ల విషయంలో అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల ఆధ్వర్యంలోని వివిధ విభాగాల అధికారులు పరిశీలన చేస్తారు
సహాయ కేంద్రాల ఏర్పాటు
క్రమబద్ధీకరణ దరఖాస్తులపై జారీచేసిన నోటీసులకు సంబంధించిన సమస్యలను నివృత్తి చేసేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లు స్థానిక సంస్థ కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాల దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలు భాగస్వాములయ్యే అన్ని స్థాయిల సిబ్బంది అధికారులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఎల్ఆర్ఎస్ వెబ్ సైట్లో రిజిస్టర్డ్ మొబైల్ నంబరుతో స్టేటస్ చెక్ చేసుకోవడానికి https://lrs.telangana.gov.in/layouts/CitizenLogin.aspx
92 total views, no views today