రాజధాని హైదరాబాద్ సహా తెలంగాణ సమగ్ర, సమ్మిళిత అభివృద్ధిని నిర్దేశించే మాస్టర్ ప్లాన్ మరో ఏడాదిలోపు అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. క్రెడాయి హైదరాబాద్ ఆధ్వర్యంలో “రీ-ఇమాజినింగ్ హైదరాబాద్” కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.
భవిష్యత్ తరాలనూ దృష్టిలో ఉంచుకొని, రేపటి అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ 4.0 అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. నాలుగో మహా నగర నిర్మాణంలో భాగంగా ఆ ప్రణాళికల్లో కొన్ని పనులను కూడా చేపట్టామని తెలిపారు.
తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన బ్యాగరికంచె ప్రాంతం రాబోయే రోజుల్లో సంపదలో బంజారాహిల్స్‌ను మించిపోతుందని చెప్పారు.
పాలకులుగా ఎవరున్నా ఈ చారిత్రక నగర అభివృద్ధికి తీసుకున్న విధానాలు కొనసాగాయి కాబట్టే హైదరాబాద్ నగరానికి ప్రపంచం స్థాయిలో ఒక గుర్తింపు వచ్చిందన్నారు.
మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్‌తో కలుషితం లేని నీటి ప్రవాహాన్ని చూడబోతున్నామని, తద్వారా హైదరాబాద్ బ్రాండ్ వ్యాల్యూ మరింత పెరిగి నగరం చుట్టుపక్కల్లో పెట్టుబడులు వెల్లువలా వస్తాయని ముఖ్యమంత్రి అన్నారు.
కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, క్రెడాయి ప్రతినిధులు పాల్గొన్నారు.
105 total views, 3 views today